రోడ్డు ప్రమాదంలో కేజీబీవీ ఎస్‌ఓ మృతి

31 Dec, 2022 07:18 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: బూర్జ మండలం వైకుంఠపురం కూడలి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్‌.ఎన్‌.పేట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం స్పెషల్‌ ఆఫీసర్‌ మండల శ్రీదేవి(38) మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని పెద్దకాపు వీధికి చెందిన శ్రీదేవి ఐదు నెలలుగా ఎల్‌.ఎన్‌.పేట కేజీబీవీ ప్రత్యేకాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ప్రతిరోజూ పాలకొండ నుంచి ఆమదాలవలస వరకు స్కూటీపై వెళ్లి అక్కడి నుంచి బస్సులో ఎల్‌.ఎన్‌.పేట వెళ్లేవారు. ఎప్పట్లాగే శుక్రవారం కూడా విధుల్లో భాగంగా స్కూటీపై వస్తుండగా వైకుంఠపురం వద్ద ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్‌ దిమ్మను ఢీకొట్టారు. ఈ ఘటనలో దవడ భాగం తెగిపోవడంతో తీవ్ర రక్త స్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

చదవండి: (షిర్డీకని వెళ్లి అనంతలోకాలకు.. పాపం గాయాలతో చిన్నారి)

స్థానికులు గమనించి 108కు ఫోన్‌ చేశారు. సిబ్బంది వచ్చి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. అదే వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శ్రీదేవికి తల్లి విజయలక్ష్మి, తమ్ముడు దినేష్‌, వివాహితురాలైన చెల్లి రేణుక ఉన్నారు. దినేష్‌ ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఎల్‌.ఎన్‌.పేటలో విషాదం.. 
శ్రీదేవి మృతితో ఎల్‌.ఎన్‌.పేటలో విషాదం అలముకుంది. కేజీబీవీ ఎస్‌ఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బోధనతో పాటు విద్యారి్థనులను తోబుట్టువులా చూసుకునేవారని స్థానికులు చెబుతున్నారు. మంచి ఎస్‌ఓను కోల్పోయామని సిబ్బంది, విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. శ్రీదేవి మృతి పట్ల ఎల్‌.ఎన్‌.పేట జెడ్పీటీసీ కిలారి త్రినాథులు సంతాపం తెలియజేశారు.  

మరిన్ని వార్తలు