'ఖాకీ బతుకులు' నవలా రచయిత కన్నుమూత

23 Mar, 2021 08:49 IST|Sakshi
‘ఖాకీ బతుకులు’ నవలా రచయిత జి.మోహనరావు (ఫైల్‌) 

 తెనాలిలోనే అంత్యక్రియలు పూర్తి

నవల కారణంగా హెడ్‌కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని కోల్పోయిన మోహనరావు 

తెనాలి : స్పార్టకస్‌ కలం పేరుతో పోలీస్‌ వ్యవస్థలోని మరో కోణాన్ని ‘ఖాకీ బతుకులు’ నవలగా చిత్రీకరించి సాహితీలోకంలో, పోలీస్‌శాఖలో సంచలనం రేపిన విశ్రాంత హెడ్‌ కానిస్టేబుల్‌ గంటినపాటి మోహనరావు(68) ఆదివారం రాత్రి కన్నుమూశారు. గుంటూరు జిల్లా తెనాలి పోలీస్‌ క్వార్టర్స్‌లోని నివాసంలో ఆయన ప్రాణాలొదిలారు. ఆయనకు భార్య మేరీ, కుమార్తె ప్రత్యూష, కుమారుడు ప్రేమ్‌చంద్‌ ఉన్నారు. సాయంత్రం ఇక్కడే అంత్యక్రియలు పూర్తిచేశారు. తెనాలిలో ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న 1980–83 మధ్యకాలంలో మోహనరావు ‘ఖాకీ బతుకులు’ నవల రాశారు. తనకన్నా ముందు 1940–75 మధ్య పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసిన తన తండ్రి ప్రకాశం జీవితానుభవాలతో రాసిన ఈ నవల, 1996లో పుస్తకరూపం దాల్చింది. 

పోలీస్‌ బాస్‌ల కన్నెర్ర...
పాతికేళ్ల కిందట వెలువడిన ఈ నవలపై అప్పటి పోలీస్‌ బాస్‌లు కన్నెర్రజేశారు. ఫలితంగా ఉద్యోగాన్ని కోల్పోయారు. దీనిపై న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. కేసును అప్పగించిన న్యాయవాదులపై నమ్మకాన్ని కోల్పోయి తన కేసును తానే వాదించుకున్నారు. 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించి 2011లో ఉద్యోగం వచ్చింది. అయితే అనంతరం 10 నెలలే హెడ్‌ కానిస్టేబుల్‌ హోదాలో పనిచేసి పదవీవిరమణ పొందారు.

సస్పెన్షన్‌లో ఉన్న కాలాన్ని సర్వీసులో చేర్చకపోవడం, అప్పట్లో రావాల్సిన సగం వేతనాన్ని నిరాకరించటంపై మళ్లీ న్యాయస్థానం తలుపుతట్టారాయన. స్పందించిన కోర్టు మోహనరావుకు 13 ఏళ్ల పెన్షనరీ ప్రయోజనాలను కల్పించాలని తీర్పునిచ్చింది. దీనిపై 2012 చివర్లో అప్పటి జిల్లా ఎస్పీ హైకోర్టుకు వెళ్లి స్టే ఉత్తర్వులు పొందారు. 13 ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండానే పింఛన్‌ ఇచ్చారు. ఎమర్జెన్సీ తర్వాత పరిణామాలతో ‘ఖాకీ బతుకులు’ రెండో భాగం రాస్తానని మోహనరావు అప్పట్లో ప్రకటించారు. అయితే అనారోగ్యం కారణంగా అది కార్యరూపం దాల్చలేదు.

మరిన్ని వార్తలు