ఖరీఫ్‌ లక్ష్యం 62 లక్షల మెట్రిక్‌ టన్నులు

12 Sep, 2020 05:37 IST|Sakshi

గతేడాది సేకరించిన ధాన్యం 47.83 లక్షల మెట్రిక్‌ టన్నులు

నాణ్యమైన బియ్యం కోసం విడిగా ధాన్యం కొనుగోలు

రూ.1,728 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కేంద్రానికి లేఖ 

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో 62 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. గతేడాది ఖరీఫ్‌లో 1,706 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.55 లక్షల మంది రైతుల నుంచి రూ.8,705 కోట్ల విలువ చేసే 47.83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 16.30 లక్షల హెక్టార్లలో వరి సాగు అవుతుండగా.. దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున 62 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆహార శాఖ దృష్టికి రాష్ట్ర అధికారులు తీసుకెళ్లారు. 1.50 కోట్ల కార్డుదారులకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సంబంధిత రకాల ధాన్యాన్ని విడిగా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తద్వారా బియ్యంలో కల్తీ లేకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది.

గన్నీ బ్యాగులతో సమస్య..
► దాన్యం కొనుగోలు, బియ్యం సరఫరాకు గన్నీ బ్యాగ్‌ల సమస్య వెంటాడుతోంది.
► వెంటనే 4.30 కోట్ల (86 వేల బేళ్ల) గన్నీ బ్యాగ్‌ల కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది.
► గన్నీ బ్యాగ్‌లను పశ్చిమ బెంగాల్‌ నుంచి సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆహార శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
► ప్రస్తుతానికి ఇబ్బందులు రాకుండా పాత గన్నీ బ్యాగ్‌లను రేషన్‌ డీలర్లు, రైస్‌ మిల్లర్ల నుంచి సేకరించాలని నిర్ణయం.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలివీ..
► ధాన్యం కొనుగోళ్లలో అవకతవకల నివారణకు క్షేత్ర స్థాయిలో పకడ్బందీ చర్యలు.
► కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి విక్రయించకుండా సరిహద్దుల వద్దే అడ్డుకుంటారు. 
► ప్రతి రైతుకూ మద్దతు ధర కల్పించేందుకు వీలుగా గ్రామ స్థాయిలోనే ధాన్యం కొనుగోళ్లు.
► ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు, ధాన్యం కొనుగోళ్లు.
► కౌలు రైతులు, పట్టాదారుల పేర్లు ఈ–క్రాప్‌ ద్వారా విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లచే నమోదు.
► మద్దతు ధరకు కొనుగోలు చేయకపోయినా, తూకాల్లో మోసం చేస్తున్నట్టు అనుమానం వచ్చినా రైతులు 1902 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. 
► ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.1,728 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి లేఖ.

భారీగా ధాన్యం కొనుగోలు
ఖరీఫ్‌లో 62 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేశాం. గన్నీ బ్యాగ్‌ల సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రాన్ని కోరాం. కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,728 కోట్ల పాత బకాయిలు విడుదల చేయాలని ఇప్పటికే లేఖ రాశాం.
– కోన శశిధర్, ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ

మరిన్ని వార్తలు