రబీకి నిండుగా నీరు

31 Oct, 2021 02:14 IST|Sakshi

ఖరీఫ్‌ పంటలు చేతికొచ్చే దశలోనూ నిండుగా ప్రాజెక్టులు

గత రెండేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ రబీలో అధిక ఆయకట్టుకు నీళ్లందించేందుకు ప్రభుత్వ ప్రణాళిక

ఖరీఫ్‌ పంటల కోతలు పూర్తవ్వగానే రబీ సాగుకు సన్నద్ధం

యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక ఆయకట్టుకు నీళ్లందించేదుకు జలవనరుల శాఖ కసరత్తు

సాక్షి, అమరావతి: విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా నీరు సమృద్ధిగా ఉంది. ఖరీఫ్‌ పంటలకు పూర్తిస్థాయిలో నీరందించిన రాష్ట్ర ప్రభుత్వం.. రబీకి కూడా నీరందించేందుకు సిద్ధమవుతోంది. 2019, 2020 తరహాలోనే యాజమాన్య పద్ధతుల ద్వారా నీరందించనుంది. తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టుకు ప్రయోజనం కలిగేలా జలవనరుల శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా గోదావరి, కృష్ణా, నాగావళి, వంశధార నదులు పోటీ పడి ప్రవహించాయి. వర్షాఛాయ ప్రాంతమైన పెన్నా నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్‌)లో కూడా సమృద్ధిగా వర్షాలు కురవడంతో పెన్నమ్మ కూడా పరవళ్లు తొక్కింది. దాంతో ఖరీఫ్‌ పంటలకు సమృద్ధిగా నీళ్లందించారు. ఇప్పటికీ వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టుల్లో గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. అందువల్ల రబీ పంటలకూ సమృద్ధిగా నీటిని సరఫరా చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

మూడు డెల్టాలతోపాటు ఇతర ఆయకట్టులోనూ..
గోదావరి డెల్టాలో ఏటా రబీ పంటలకు నీటిని సరఫరా చేస్తారు. కృష్ణా డెల్టాలో 2019లో తొలి సారిగా రబీకి ప్రభుత్వం అధికారికంగా నీటిని విడుదల చేసింది. గతేడాది కూడా దాన్ని కొనసాగించింది. ఈ ఏడాదీ కృష్ణా డెల్టాలో రబీకి  నీళ్లిచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కండలేరు, సోమశిల రిజర్వాయర్లలో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. దీంతో పెన్నా డెల్టాలో కూడా పూర్తి స్థాయిలో రబీకి నీళ్లందించనుంది. వంశధారలో గతేడాది తరహాలోనే నీటి లభ్యత ఆధారంగా ఈ ఏడాదీ సాగు నీరిచ్చేందుకు చర్యలు చేపట్టింది. తుంగభద్రలోనూ వరద కొనసాగుతుండటంతో హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ) ఆయకట్టులో నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. 
నీటితో కళకళలాడుతున్న ప్రకాశం బ్యారేజీ 

అవకాశం ఉన్న ప్రతి ప్రాజెక్టులోనూ నీటి విడుదల
వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు నిండటంతో ఖరీఫ్, రబీల్లో 2019, 2020లలో కోటి ఎకరాల చొప్పున ఆయకట్టుకు నీళ్లందించాం. ఈ ఏడాదీ అదే రీతిలో ఖరీఫ్‌లో నీళ్లందించాం. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ విధానంలో నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. రబీలోనూ అధిక ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు రబీలో అవకాశం ఉన్న ప్రతి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నాం. 
– సి.నారాయణరెడ్డి, జలవనరుల శాఖ ఈఎన్‌సీ 

మరిన్ని వార్తలు