లక్ష్యం దిశగా 'సాగు'తున్న ఖరీఫ్‌

12 Sep, 2021 03:54 IST|Sakshi

లక్ష్యం 95.35 లక్షల ఎకరాలు

ఇప్పటి వరకు సాగయిన విస్తీర్ణం 75లక్షల ఎకరాలు

ఈసారి తగ్గిన వేరుశనగ, పత్తి, మిరప పంటల సాగు

ఆ మేరకు అపరాలు, చిరుధాన్యాల వైపు మళ్లిన రైతులు

సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఖరీఫ్‌ లక్ష్యం దిశగా సాగవుతున్నది. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా పడుతుండడంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తుండడంతో ఖరీఫ్‌ సాగు వేగం పుంజుకుంది.  

రాయలసీమలో అధిక వర్షపాతం
సీజన్‌లో సాధారణ వర్షపాతం 556 ఎంఎం కాగా, సెప్టెంబర్‌ 10 నాటికి 441 ఎంఎం వర్షపాతం కురవాల్సి ఉండగా, 500 ఎంఎం వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్ర సాధారణ వర్షపాతం 622.4 ఎంఎం కాగా, సెప్టెంబర్‌ 10 నాటికి 497.9 ఎంఎం కురవాల్సి ఉండగా.. 536.2 ఎంఎం వర్షపాతం కురిసింది. ఇక రాయలసీమలో సాధారణ వర్షపాతం 406.6ఎంఎం కాగా, సెప్టెంబర్‌ 10 నాటికి 312.9 ఎంఎం కురవాల్సి ఉండగా..415.4 ఎంఎం కురిసింది.కోస్తాంధ్రలో సాధారణ వర్షపాతం కురవగా, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం కురిసింది.

లక్ష్యం దిశగా ఖరీఫ్‌..
రాష్ట్రంలో ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం 93.32లక్షల ఎకరాలు కాగా, 2019లో రికార్డు స్థాయిలో 90.38లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, 2020లో 90.20లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగైంది. కాగా ఈఏడాది 95.35లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు చెయ్యాలని లక్ష్యంగా నిర్ధేశించగా ఇప్పటికే 75లక్షల ఎకరాల (80 శాతం) విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌సీజన్‌లో  అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి సాధారణ విస్తీర్ణం 38.4లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 39.97 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 32 లక్షల ఎకరాల్లో (83శాతం) వరి సాగైంది. ఈ ఏడాది మొక్కజొన్న లక్ష్యానికి మించి సాగైంది. 2.55లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చెయ్యాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటి వరకు 2.60లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఇక  9లక్షల ఎకరాల్లో అపరాలు సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 86 శాతం సాగయ్యాయి. అత్యధికంగా కందులు  5.05 లక్షల ఎకరాల్లో సాగవగా, మిగిలిన విస్తీర్ణంలో మినుములు, పెసలు, ఉలవలు సాగయ్యాయి. 19.95లక్షల ఎకరాల్లో నూనెగింజలు సాగు చెయ్యాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటి వరకు 16.47లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.

తగ్గనున్న వేరుశనగ, పత్తి, మిరప
ప్రధానంగా 18.62లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వేరుశనగ  ఈసారి 15.47లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అదే విధంగా పత్తి సాగు లక్ష్యం 15లక్షల ఎకరాలు కాగా, 12లక్షల ఎకరాల్లోనే సాగైంది. అదే విధంగా 3.72లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన మిరప ఈ ఏడాది 2.23లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ మేరకు ఈ మూడు పంటలకు సంబంధించి ఏటా సాగవ్వాల్సిన విస్తీర్ణం పూర్తయినట్టుగా వ్యవసాయశాఖాధికారులు లెక్కతేల్చారు. దీంతో ఆ మేరకు మిగిలిన విస్తీర్ణంలో రైతులు అపరాలు, చిరు ధాన్యాల వైపు మళ్లినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. 

7.56లక్షల టన్నుల ఎరువుల నిల్వలు
ఖరీఫ్‌ సీజన్‌కు 20.20లక్షల టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో 19.69లక్షల టన్నుల నిల్వలుండగా, ఇప్పటి వరకు 12,13,187 టన్నుల అమ్మకాలు జరిగాయి. కాగా సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి ఖరీఫ్‌సాగు పూర్తయ్యే అవకాశాలుకన్పిస్తున్నాయి. ఆమేరకు అవసరమైన ఎరువులు, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు ఎక్కడా కొరత రానీయకుండా సమృద్ధిగా నిల్వ ఉంచారు. ఖరీఫ్‌ సాగు కోసం సెప్టెంబర్‌ నెలకు  రైతులకు 6,07,017 ఎంటీల ఎరువుల అవసరం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 7.56లక్షల ఎంటీల ఎరువుల నిల్వలు ఉన్నాయి.  

లక్ష్యానికి మించి పంటల సాగు
ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో లక్ష్యానికి మించి పంటలు సాగయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సీజన్‌ ముగిసే వరకు రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయి. కృత్రిమ కొరత సృష్టించే డీలర్లపై నిఘా ఉంచాం.  
    –హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ   

మరిన్ని వార్తలు