ఆహార ధాన్యాల సాగు.. బాగు

25 Oct, 2021 02:45 IST|Sakshi

ముగిసిన ఖరీఫ్‌..

ఆహార ధాన్యాల విస్తీర్ణం గత ఏడాది కంటే అధికం.. 2020లో అది 50.12 లక్షలైతే

ఈ ఏడాది 51.60 లక్షల ఎకరాల్లో సాగు

రాయలసీమలో అత్యధికంగా వరి సాగు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ముగిసింది. చివర్లో ‘గులాబ్‌’ తుపాను గుబులు పుట్టించినప్పటికీ ఆశించిన స్థాయిలో కురిసిన వర్షాలతో సాగు సజావుగా సాగింది. గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఏడాది విస్తీర్ణంలో కాస్త తగ్గినప్పటికీ ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం మాత్రం కాస్త పెరిగింది. వరితో సహా మిరప, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్, ఉల్లి లక్ష్యానికి మించి సాగయ్యాయి. మొత్తమ్మీద 96.4 శాతం మేర సాధారణ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో నూరు శాతం అధిగమించగా, కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 99 శాతం మేర సాగయ్యాయి. ఇక విశాఖపట్నం మినహా మిగిలిన జిల్లాల్లో 90–96 శాతం మేర అయితే.. విశాఖలో మాత్రం 87 శాతం మేర మాత్రమే పంటలు సాగయ్యాయి.

రాయలసీమలో ‘వరి’ సిరులు
ఖరీఫ్‌లో వరి సాధారణ విస్తీర్ణం 38.40 లక్షల ఎకరాలు. 2019లో అది 38.15 లక్షల ఎకరాలు అయితే, 2020లో 38.52 లక్షల ఎకరాల్లో సాగయింది. అదే ఈ ఏడాది 39.17లక్షల ఎకరాల్లో సాగైంది. విశాఖ (95 శాతం), శ్రీకాకుళం (96 శాతం), పశ్చిమగోదావరి (97 శాతం) జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో నూరు శాతానికి మించి వరి సాగైంది. అత్యధికంగా రాయలసీమలోని  చిత్తూరులో 193 శాతం, వైఎస్సార్‌ కడపలో 133 శాతం, అనంతపురంలో 125 శాతం, కర్నూలులో 100 శాతం మేర వరి సాగైంది.

పెరిగిన మిరప, మొక్కజొన్న, అపరాలు
► గడిచిన సీజన్‌తో పోలిస్తే ఈసారి మిరప, మొక్కజొన్న రికార్డు స్థాయిలో సాగయ్యాయి. 
► మిరప దాదాపు 1.24 లక్షల ఎకరాల్లో అదనంగా సాగైంది. దీని సాధారణ విస్తీర్ణం 3.40 లక్షల ఎకరాలైతే.. గతేడాది 3.43 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది ఏకంగా 4.67 లక్షల ఎకరాల్లో సాగైంది. 
► ఇక మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలు కాగా.. గతేడాది 2.81 లక్షల ఎకరాల్లో సాగైంది. తొలిసారిగా ఈ ఏడాది 3.08 లక్షల ఎకరాల్లో సాగైంది. 
► అపరాల సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. గత ఖరీఫ్‌లో 6.76 లక్షల ఎకరాల్లో సాగైన అపరాలు ఈసారి 7.41 లక్షల ఎకరాల్లో సాగైంది.

తగ్గిన వేరుశనగ, పత్తి సాగు
ఇక ఖరీఫ్‌లో నూనె గింజల సాధారణ విస్తీర్ణం 18.97 లక్షల ఎకరాలు కాగా.. గత సీజన్‌లో 19.22 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 17.37 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. గతేడాదితో పోలిస్తే 2 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. అలాగే, గతేడాది 18.41 లక్షల ఎకరాల్లో సాగైన వేరుశనగ ఈ ఏడాది 16.26 లక్షల ఎకరాలకే పరిమితమైంది. 14.73 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన పత్తి 12.86 లక్షల ఎకరాల్లో సాగైంది. 

మరిన్ని వార్తలు