వడివడిగా ‘ఈ పంట’ నమోదు

23 Aug, 2021 03:12 IST|Sakshi
కృష్ణా జిల్లా అకునూరులో ఈ-పంట వివరాలు నమోదు చేస్తున్న ఆర్బీకే సిబ్బంది

ఖరీఫ్‌ సాగు లక్ష్యం 92.21 లక్షల ఎకరాలు 

ఇప్పటివరకు 57.88 లక్షల ఎకరాలు సాగులోకి 

ఈ క్రాప్‌ నమోదైన విస్తీర్ణం 34.62 లక్షల ఎకరాలు 

మరో 7.53 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు నమోదు 

ఈ క్రాపింగ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం 

గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్న ఆర్బీకే సిబ్బంది 

సాక్షి, అమరావతి: ప్రభుత్వం నుంచి ఏ రాయితీ పొందాలన్నా ‘ఈ క్రాప్‌’ తప్పనిసరి కావడంతో రైతు భరోసా కేంద్రాల వద్ద పంటల నమోదుకు రైతన్నలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో సాగవుతున్న ప్రతీ ఎకరం వివరాలను నమోదు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పంట నమోదును చేపట్టింది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోలుతోపాటు పంట రుణాలు, పంట నష్టపరిహారం, పంటల బీమా పొందేందుకు ఈ క్రాపే ప్రామాణికం. అన్నిటికీ అదే ఆధారం కావడంతో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ పంట నమోదు వేగం పుంజుకుంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 92.21 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా ఇప్పటివరకు 57.88 లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. 39.97 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 22.05 లక్షల ఎకరాల్లో వరి సాగును చేపట్టారు.   

ఇప్పటివరకు ఈ క్రాప్‌ ఇలా.. 
వ్యవసాయ పంటల విషయానికి వస్తే 13 లక్షల ఎకరాల్లో వరి, 2.17 లక్షల ఎకరాల్లో ముతక ధాన్యాలు, 2.80 లక్షల ఎకరాల్లో అపరాలు, 9.91 లక్షల ఎకరాల్లో నూనెగింజలు, 6.74 లక్షల ఎకరాల్లో ఇతర పంటల వివరాల నమోదు (ఈ క్రాపింగ్‌) పూర్తి చేశారు. మొత్తమ్మీద ఇప్పటి వరకు 34.62 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలతో పాటు 7.53 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలతో కలిపి మొత్తం 42.15 లక్షల ఎకరాల్లో ఈ క్రాప్‌ పూర్తయింది.  
 
ఆర్‌బీ యూడీపీ యాప్‌లో ఎన్నో ప్రత్యేకతలు 
మరింత సాంకేతికత జోడించి కొత్తగా తెచ్చిన రైతుభరోసా యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా ఈ క్రాప్‌ నమోదు చేస్తున్నారు. యూడీపీ యాప్‌ ద్వారా ఈ–కేవైసీ చేస్తున్నారు. ఏ పంట వేశారు? ఎప్పుడు కోతకు వస్తుందో కూడా తెలిసేలా యాప్‌ను డిజైన్‌ చేశారు. పంట వివరాలను నమోదు చేయగానే డిజిటల్‌ కాపీని రైతులకు అందిస్తున్నారు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తున్నారు. ముందుగానే రైతులు వివరాలను నమోదు చేసుకోవడం వలన ఎన్ని సర్వే నెంబర్లలో ఈ పంట నమోదు చేశారు? ఇంకా ఎన్ని చేయాల్సి ఉందో వెంటనే తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ పంట నమోదుకు దూరంగా ఉన్న భూముల వివరాలను కూడా ఇప్పుడు నమోదు చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని భూములు, పట్టాదారు పాసుపుస్తకాలు పొందలేనివి, పూర్వీకుల నుంచి డాక్యుమెంట్ల ద్వారా వారసులకు దాఖలైనవి, నోటిమాట ఒప్పందాల ప్రకారం వారసులు సాగు చేస్తున్నవి, కౌలు, దేవదాయ, చుక్కల భూముల వివరాలను సైతం ఈ పంటలో నమోదు చేస్తుండడంతో లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.  

ఎలా నమోదు చేసుకోవాలంటే.. 
యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ యాప్‌పై రైతు భరోసా కేంద్రాల స్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. విత్తనం వేయగానే ప్రతీ రైతు ఆర్బీకేలో పంట వివరాలను నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న 15 రోజుల తర్వాత గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకుల్లో ఒకరు క్షేత్రస్థాయికి వెళ్లి పంటల ఫొటోలను తీస్తున్నారు. ఆ వివరాలతో కూడిన డిజిటల్‌ సర్టిఫికెట్‌ను రైతు స్మార్ట్‌ ఫోన్‌కు పంపిస్తున్నారు. గ్రామ పరిధిలో ఎంతమంది రైతులున్నారు? ఎవరు, ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేస్తున్నారో యా‹ప్‌లో కనిపిస్తుంది. ఈ క్రాప్‌పై అవగాహన కల్పించి దశల వారీగా నమోదును పెంచడానికి వ్యవసాయ శాఖ వినూత్న మార్గాలను ఎంచుకుంటోంది. ఈ క్రాప్‌ ఆవశ్యకతపై దండోరా వేయిస్తున్నారు. యాప్‌లో ఒకసారి నమోదు చేస్తే సీజన్‌ ముగిసే వరకు అన్ని రకాల ప్రయోజనాలు పొందేందుకు ఉపకరిస్తుంది.  

పంట నమోదు తప్పనిసరి
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు పొందాలంటే పంటల నమోదు (ఈ క్రాప్‌) తప్పనిసరి. ఈ సారి కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఆర్‌బీ యూడీïపీ యాప్‌లో నమోదు చేసుకుంటే రసీదు కూడా ఇస్తారు. ఈ రసీదు ఉంటే చాలు పంట రుణం, పంటల బీమా, పరిహారం ఏదైనా పొందొచ్చు. కనీస మద్దతు ధరకు దర్జాగా అమ్ముకోవచ్చు. ఖరీఫ్‌లో రైతులందరూ విధిగా తమ పంట వివరాలను ఆర్‌బీకే సిబ్బంది వద్ద నమోదు 
చేసుకోవాలి.     
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్‌ వ్యవసాయ శాఖ   

మరిన్ని వార్తలు