భళా.. కిడాంబి

16 May, 2022 05:13 IST|Sakshi

థామస్‌ కప్‌ విజయంలో శ్రీకాంత్‌ కీలక పాత్ర

దేశానికి గర్వకారణమన్న తల్లిదండ్రులు

అద్భుత ఆటగాడని సహచరుల ప్రశంసలు

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ విజయాన్ని భారత జట్టు గెలుపొందడం, అందులో గుంటూరుకు చెందిన షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషించడంతో ఆదివారం క్రీడాభిమానులు, సహచరులు, కోచ్‌లు ఉద్వేగానికి లోనయ్యారు. శభాష్‌ శ్రీకాంత్‌.. అంటూ ప్రశంసలు కురిపించారు. 2018లో ప్రపంచ నంబర్‌ వన్‌ స్థానం పొందిన తర్వాత అనేక విజయాలు నమోదు చేసినా, భారత చిరకాల వాంఛ అయిన థామస్‌ కప్‌ గెలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. థామస్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ తనదైన శైలిలో ప్రత్యర్థి ఇండోనేషియా ఆటగాడు, ఏషియన్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ జోనాటన్‌ క్రిస్టీని 21–15, 23–21 స్ట్రెయిట్‌ సెట్స్‌లో మట్టికరిపించి తెలుగోడి సత్తా చాటాడు. గుంటూరులో ఉన్న శ్రీకాంత్‌ తండ్రి కృష్ణను షటిల్‌ బ్యాడ్మింటన్‌  అసోసియేషన్‌ సభ్యులు సంపత్‌ కుమార్, డి.శ్రీనివాసరావులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

గుంటూరులోనే ఓనమాలు
ఏడేళ్ల వయసులో శ్రీకాంత్‌ స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో వేసవి శిక్షణకు సరదాగా వచ్చాడు. అప్పుడే అతనిలోని వేగాన్ని గుర్తించిన శిక్షకులు, సీనియర్‌ ఆటగాళ్లు తల్లిదండ్రులు కృష్ణ, రాధలకు మరింత ఉత్తమ శిక్షణ ఇప్పించాలని సలహా ఇవ్వడంతో హైదరాబాద్‌కు మకాం మార్చారు. అయినప్పటికీ శ్రీకాంత్‌ తల్లిదండ్రులు గుంటూరుతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అడపాదడపా శ్రీకాంత్‌ గుంటూరుకు రావడం, పాత మిత్రులను కలవడం జరుగుతోంది.

ఈ దేశం గర్విస్తోంది..
థామస్‌ కప్‌లో నా కుమారుడు శ్రీకాంత్‌ విజయాన్ని దేశం సాధించిన విజయంగా నేను భావిస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణతో సాధన చేశాడు. దీని కోసం ఎన్నో సరదాలను త్యాగం చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ విశ్రమించకుండా సాధన చేస్తునే ఉంటాడు. శ్రీకాంత్‌ను చూసి మరింత మంది ఔత్సాహిక క్రీడాకారులు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను.
– కిడాంబి కృష్ణ, శ్రీకాంత్‌ తండ్రి 

అద్భుత వేగం అతని సొంతం
ఎన్టీఆర్‌ స్టేడియంలో తొలి నాళ్లలో శ్రీకాంత్‌ సాధన చేయడం చూశాను. అద్భుత వేగం అతని సొంతం. తోటి పిల్లలతో సరదాగా ఉండడంతో పాటు, ఆట సమయంలో వేరే ధ్యాస లేకుండా దృష్టి సారించే వాడు. విజయం సాధించాలంటే ఏమి చేయాలో అతనికి బాగా తెలుసు. అందుకోసం చేసేదంతా క్రమశిక్షణతో చేసేవాడు. ఈ రోజు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌ నుంచి మ్యాచ్‌లు గమనిస్తే భారత బృందం కొత్త దూకుడు విధానాన్ని అనుసరించింది. ప్రత్యర్థులు ఇది తెలుసుకునే లోపే విజయం భారత్‌ సొంతమయ్యింది.
– షేక్‌ అన్వర్‌ బాషా, షటిల్‌ కోచ్‌

ఇదొక చరిత్రే
భారత జట్టులోని ఐదుగురిలో నలుగురు తెలుగువారు. అందులో మన గుంటూరు షట్లర్‌ శ్రీకాంత్‌ ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. అటువంటి క్రీడాకారుడ్ని పొందిన రాష్ట్రం, దేశం గర్వపడుతోంది. మా ముందు ఓనమాలు నేర్చుకున్న పిల్లాడు ఈ రోజు ప్రపంచం మెచ్చే ప్లేయర్‌గా గుర్తింపు పొందడం పట్ల అసోసియేషన్‌ సభ్యులు, క్రీడాభిమానులం గర్వంగా ఫీల్‌ అవుతున్నాం.
– సంపత్‌ కుమార్, షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి  

మరిన్ని వార్తలు