గాడిదలను అపహరించి సొమ్ము చేసుకుంటున్నారు!

31 Jan, 2022 05:07 IST|Sakshi
తాడేపల్లిలో ఓ ఇంట్లో కట్టేసి ఉన్న గాడిద

తాడేపల్లిరూరల్‌: తమ ఇంటి మహాలక్ష్మిగా పెంచుకుంటున్న గాడిదలను కొందరు అపహరించి అమ్ముకోవడంపై వాటి యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి అమ్ముకున్న వారు నష్టపరిహారం చెల్లించడంతో వారు మొత్తబడ్డారు. కర్నూల్‌ పట్టణ పరిధిలో దోబీ పనిచేసి జీవనం సాగించే కొంతమంది దుస్తులు మోసేందుకు గాడిదలను పెంచుతూ వాటిని ఎంతో ఆప్యాయంగా చూస్తుంటారు. అయితే బబ్లూ, శ్రీనివాసరావు, దుర్గారావులకు చెందిన గాడిదలను బాపట్లకు చెందిన రజనీకాంత్‌ అనే వ్యక్తి అపహరించి వాటిని తాడేపల్లిలో అమ్మాడు. దీంతో బబ్లూ, శ్రీనివాసరావులు తమ స్నేహితులతో కలసి రాష్ట్రంలో గాడిదలను ఎక్కడెక్కడ వధించి మాంసాన్ని విక్రయిస్తారో గూగుల్‌లో సెర్చ్‌ చేసి తాడేపల్లి చేరుకున్నారు.

ఒక ఇంట్లో కట్టేసి ఉన్న తమ గాడిదను బబ్లూ, శ్రీనివాసరావులు గుర్తించి తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారించగా.. కర్నూలు నుంచి అపహరించిన మూడు గాడిదల్లో రెండింటిని మాంసం కోసం విక్రయించినట్టు తెలిపారు. మిగిలిన ఆ గాడిదను బబ్లూకు అప్పగించారు. అమ్మిన రెండు గాడిదలకు వెల కట్టి రూ.1.60 లక్షలను కర్నూలు యువకులకు అందించారు.    

మరిన్ని వార్తలు