‘ఆమని’ని ఆదుకోండి.. దాతల సాయం కోసం వేడుకోలు..

17 Mar, 2022 10:56 IST|Sakshi

సాక్షి, కృష్ణా: ఆడుతూ, పాడుతూ చదువుకునే వయసులో ఆ చిన్నారిని కిడ్నీ వ్యాధి పట్టి పీడిస్తోంది. రెండు కిడ్నీలు పాడైపోయిన ఆ చిన్నారి తల్లిదండ్రులు రెక్కల కష్టం మీద బతుకుబండి లాగిస్తున్నారు. అయితే చిన్న వయసులోనే కుమార్తె మంచానికి పరిమితం కావడం వారి ఆవేదన వర్ణనాతీతం. తమ ఉన్నదంతా కూతురు వైద్యానికి ఖర్చుపెట్టినా ఫలితం లేకపోయింది. 

కష్ణాజిల్లా గన్నవరం మండలం బుద్ధవరం శివారు రాజీవ్‌నగర్‌కు చెందిన కర్నాటి పోతురాజు చిన్న కుమార్తె వెంకట నాగ ఆమని ఎనిమిదో తరగతి చదువుతోంది. అయితే తరచు అనారోగ్యం పాలవడంతో వైద్యుల్ని సంప్రదించగా రెండు కిడ్నీలు పాడైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమనికి తమిళనాడు రాయవెల్లూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఇప్పటివరకూ చికిత్స కోసం రూ.7లక్షల వరకూ ఖర్చు చేశారు.

అయితే కిడ్నీ మార్పిడి చేసేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నా ఆర్థిక స్తోమత లేక ఆమని తల్లిదండ్రులు.. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కిడ్నీ మార్పిడికి సుమారు 15 లక్షలు అవుతుందని, అవి సమకూరితే తన కిడ్నీ కూతురికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోతురాజు తెలిపారు. మానవతా దృక్ఫదంతో ఆమని చికిత్స కోసం దాతలు సాయం చేసి, తన కుమార్తెను బతికించాలని  వేడుకుంటున్నారు.  ఎవరైనా సాయం చేయాలనుకునే వారు గూగుల్‌ పే, ఫోన్‌ పే నెంబర్లు 9347464615, 9247298421 కు పంపించాలని కోరుతున్నారు.

కర్నాటి వెంకటేశ్వరమ్మ
ఇండియన్‌ బ్యాంక్‌
అకౌంట్‌ నంబర్‌: 6284875577
IFSC Code‌: IDIB000P032
వెంకటాపురం, పశ్చిమ గోదావరి జిల్లా

మరిన్ని వార్తలు