కిడ్నీలపై.. జంట భూతాల ప్రభావం 

6 Aug, 2023 04:28 IST|Sakshi

మధుమేహం, రక్తపోటులతో కిడ్నీలు ఎఫెక్ట్‌ 

85 శాతం మందికి  ఈ రెండే కారణం  

అవగాహనతో అదుపులో ఉంచుకోవాలంటున్న నిపుణులు 

ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో లక్షణాలు గుర్తింపు 

ముందుగానే మెరుగైన వైద్యం పొందుతున్న గ్రామీణులు 

శరీరంలో అత్యంత కీలకమైన కిడ్నీలను రెండు జీవనశైలి వ్యాధులు భూతాల్లా పట్టుకున్నాయి. వాటి బారిన పడి కిడ్నీలు దెబ్బతిని ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఆ భూతాలే మధుమేహం, రక్తపోటు. ఈ రెండూ అదుపులో లేకపోవడంతో వాటి ప్రభావం కిడ్నీలపై పడుతోంది. క్రమంగా అవి చెడిపోతున్నాయి.

కిడ్నీ వ్యాధులకు మిగతా కొన్ని కారణాలు కూడా ఉన్నప్పటికీ, 85 శాతం వ్యాధిగ్రస్తుల్లో మధుమేహం, రక్తపోటు బాధితులే ఉన్నారు. ఇటీవల వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ఈ వ్యాధుల నియంత్రణకు తోడ్పడుతోంది. వైద్యులు గ్రామాలకు వెళ్లిన సమ­యం­­లో ప్రజలో వీటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలా ఫ్యామి­లీ డాక్టర్‌ విధానం గ్రామీణ ప్రాంతాల వారికి వరంలా మారింది.   – లబ్బీపేట (విజయవాడ తూర్పు)

అవగాహన లేకనే.. 
అవగాహన లేమి, అదుపులో లేని మధుమేహం, రక్తపోటు, విచ్చలవిడిగా పెయిన్‌ కిల్లర్స్‌ వినియో­గం కిడ్నీ వ్యాధులకు దారి తీస్తుంది. కిడ్నీ వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే చివరకు డయాలసిస్, ఆ తర్వాత కిడ్నీ మార్పిడి చేయించుకోవాల్సి వస్తుంది. ఇదం­తా అత్యంత వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. అందువల్ల ముందు జాగ్రత్తే మంచిదని వైద్యు­లు చెబుతున్నారు.

కిడ్నీ వ్యాధుల్లో కొందరిలో ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఏ లక్షణాలూ కనిపించకుండానే డయాలసిస్‌ అవసరం అయ్యేంత పరిస్థితికి దారితీస్తున్నాయి. కిడ్నీ వ్యాధు­లకు గురయ్యే వారిలో 45 శాతం మందికి మధుమేహం కారణం కాగా, మరో 55 శాతం మందికి అధిక రక్తపోటు, ఇతర కారణాలుగా చెబుతున్నారు.

యూరిన్‌ ఆల్బుమిన్, సీరమ్‌ క్రియాటిన్, స్కానింగ్‌ వంటి చిన్నపాటి పరీక్షలతో కిడ్నీ పని తీరును తెలుసుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌ రెండు రకాలుగా ఉంటుంది. అక్యుట్‌ ఫెయిల్యూర్, క్రానిక్‌ ఫెయిల్యూర్‌. అక్యుట్‌ ఫెయిల్యూర్‌ను సరైన చికిత్సతో సాధారణ స్థితికి తేవచ్చు. క్రానిక్‌లో అలా చేయలేం.  

ఫ్యామిలీ డాక్టర్‌ ఓ వరం 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ విధానం  గ్రామీణులకు వరంలా మారింది.  నెలలో రెండు రోజులు గ్రామాలకే వెళ్లి పరీక్షలు చేయడంతో కిడ్నీ వ్యాధుల లక్షణాలను ముందుగానే  గుర్తించగలుగుతున్నారు. కిడ్నీ వ్యాధి ఉన్నట్లు సందేహం ఉన్న వారికి  పీహెచ్‌సీలకు పంపించి పరీక్షలు చేయిస్తున్నారు. దీంతో ఏమాత్రం చిన్నపాటి లక్షణాలు గుర్తించినా ఫెయి­ల్యూర్‌కు దారితీయకుండా కాపాడుకోగలుగుతున్నారు. నిపుణుల వద్దకు వెళ్లి  మెరుగైన వైద్యం పొందుతున్నారు. 

కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణాలు 
అదుపులో లేని మధుమేహం, రక్తపోటు 
 గ్లొమెరుల్లోనెఫ్రిటిస్‌ 
 ఎడిపికెడి–పొలిసిస్టిక్‌ కిడ్నీ డిసీజ్‌ (ఇది వంశపారంపర్యంగా వస్తుంది) 
 ఆటో ఇమ్యూన్‌ జబ్బులు  
 ఊబకాయం, ధూమపానం 
 విచ్చలవిడిగా నొప్పి నివారణ మాత్రలు వాడటం.. దీర్ఘకాలం పాటు గ్యాస్‌ మాత్రల వినియోగం 
 దీర్ఘకాలంలో గుండె, ఇతర జబ్బులు 
 మాంసాహార ప్రొటీన్‌ అధికంగా తీసుకోవడం 

కిడ్నీ ఫెయిల్యూర్‌ లక్షణాలు.. 
 ఆయాసం, అలసట 
 కాళ్ల వాపులు, ముఖం వాపు 
 మూత్రం తగ్గిపోవడం 
 ఎముకలు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి 
 కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండా డయాలసిస్‌ స్టేజ్‌కి చేరవచ్చు 

నిర్ధారణ ఇలా: కిడ్నీ వ్యాధులను సీరమ్‌ క్రియాటిన్, యూరిన్‌ ఆల్బూమిన్, పొట్ట అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ వంటి పరీక్షల ద్వారా  తెలుసుకుంటున్నారు 

మరిన్ని వార్తలు