కైనటిక్‌ గ్రీన్‌‌ ప్రతినిధులతో మేకపాటి భేటీ

16 Sep, 2020 12:46 IST|Sakshi

ఎలక్ట్రిక్‌‌ వాహనాల తయారీ దిశగా అడుగులు

ఏపీలో విద్యుత్‌ వాహనాల మానుఫాక్చరింగ్‌పై చర్చ

సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, రీఛార్జ్‌ యూనిట్లు ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, రీఛార్జ్ యూనిట్ల ఏర్పాటుకు 'కైనెటిక్‌ గ్రీన్‌' వ్యవస్థాపకురాలు, సీఈవో సులజ్జ ఫిరోడియా మోత్వాని ముందుకొచ్చారు. విజయవాడలోని కానూరలో పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డిని బుధవారం ఆమె కలిశారు. ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాల మ్యాన్‌ఫాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుపైన చర్చించారు. కార్యక్రమంలో కైనటిక్‌ గ్రీన్‌ ఎండీ రితేశ్‌, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల రీఛార్జ్ స్టేషన్లు నెలకొల్పడంపైనా సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. 

ఎలక్ట్రానిక్ పాలసీలో విద్యుత్ వాహనాల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. పర్యావరణానికి హాని లేని విద్యుత్ వాహనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. విద్యుత్ వాహన రంగానిదే విద్వత్ అని ఆయన అభివర్ణించారు. ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) అప్రూవ్ చేసిన  మూడు చక్రాల విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టిన మొదటి సంస్థగా  'కెనెటిక్ గ్రీన్ ఎనర్జీ'కి పేరు గడించిందని సీఈఓ సులజ్జ చెప్పారు. ఇప్పటికే భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)తో భాగస్వామ్యమైనట్లు మంత్రికి వివరించారు. 
(చదవండి: పెట్రోల్‌ బంకుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌)

మరిన్ని వార్తలు