కిసాన్‌ డ్రోన్లపై కసరత్తు!

15 Aug, 2022 23:39 IST|Sakshi
పంటపై పురుగు మందును పిచికారి చేస్తున్న డ్రోన్‌

రైతులకు వ్యవసాయశాఖ అవగాహన 

వీటి కొనుగోలుకు రాయితీ ఇస్తున్న ప్రభుత్వం  

పురుగు మందుల పిచికారీకి డ్రోన్ల వినియోగం  

అన్నదాతలకు తగ్గనున్న కూలీల భారం  

నెలాఖరుకల్లా గ్రూపుల ఎంపిక పూర్తికి సన్నాహాలు

సాక్షి, విశాఖపట్నం: రానురాను వ్యవసాయానికి పెట్టుబడి పెరిగిపోతోంది. కూలీల కొరత కూడా  అధికమవుతోంది. వీటన్నిటిని అధిగమించి సాగు చేయడం అన్నదాతకు తలకు మించిన భారమవుతోంది. ఇలా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతాంగం ఎంతగానో  సతమతమవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.

ఇప్పటికే రైతులకు వివిధ యంత్రాల పనిముట్లను రాయితీపై అందిస్తోంది. తాజాగా పంటలకు పురుగు మందులను పిచికారీ చేయడానికి కిసాన్‌ డ్రోన్లను అందుబాటులోకి తెస్తోంది. వీటిని రైతులకు సబ్సిడీపై సరఫరా చేయనుంది. ఇందుకోసం జిల్లాల వారీగా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) పరిధిలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. ఈ పనిని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టారు. ప్రాథమికంగా మండలానికి మూడు చొప్పున కిసాన్‌ డ్రోన్లను మంజూరు చేయనున్నారు.

ఒకే పంట విస్తీర్ణం ఎక్కువగా ఉండే ప్రాంతాలను డ్రోన్ల వినియోగానికి వీలుగా ఉంటుందని భావించి అలాంటి వాటిని తొలుత ఎంపిక చేస్తున్నారు. కిసాన్‌ డ్రోన్లు మంజూరుకు నిబంధనల ప్రకారం ఐదుగురు రైతులు గ్రూపుగా ఏర్పడాల్సి ఉంటుంది. వీరిలో ఒకరు కనీసం పదో తరగతి/ఇంటర్మీడియట్‌ విద్యార్హతను కలిగి ఉండాలి. ఈయనకు డ్రోన్‌ వినియోగంలో శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన రైతుకు సర్టిఫికెట్‌ కూడా ఇస్తారని విశాఖపట్నం జిల్లా వ్యవసాయ అధికారి కె.అప్పలస్వామి ‘సాక్షి’కి చెప్పారు.  

డ్రోన్లపై రైతులకు అవగాహన.. 
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొద్ది రోజుల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు కిసాన్‌ డ్రోన్లపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఆయా గ్రామాల్లో వీటితో ఒనగూరే ప్రయోజనాలను వారికి వివరిస్తున్నారు.  విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి, ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాలు మినహా మిగిలినవి అర్బన్‌ ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో పద్మనాభం మండలంలోనే అధికంగా పంటలు పండిస్తున్నారు.

అందువల్ల విశాఖపట్నం జిల్లాలో పంటల సాగు తక్కువగానే జరుగుతోంది. దీంతో విశాఖ జిల్లాలో 57 ఆర్‌బీకేలున్నప్పటికీ ఇప్పటివరకు కిసాన్‌ డ్రోన్ల కోసం ఐదు గ్రూపులు మాత్రమే ముందుకు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 22 మండలాల్లో 66 రైతు గ్రూపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అక్కడ గిరి ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 38 గ్రామాలు కిసాన్‌ డ్రోన్ల మంజూరుకు అనువైనవని గుర్తించారు.

అలాగే అనకాపల్లి జిల్లాలో 24 మండలాలకు గాను 72 గ్రామాలను ఇందుకు ఎంపిక చేసినట్టు ఆ జిల్లా వ్యవసాయ అధికారి లీలావతి చెప్పారు. రైతు గ్రూపుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి సెప్టెంబర్‌లో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇస్తారు. శిక్షణ అయ్యాక డ్రోన్ల కొనుగోలుకు వీలవుతుంది.  

ఉద్యాన పంటలకు సైతం..  
సాధారణంగా పంటలకు సోకిన తెగుళ్ల నివారణకు పురుగు మందులను స్ప్రేయర్లలో నింపి పంటపై స్ప్రే చేస్తారు. వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలకు సోకే తెగుళ్ల నివారణకు పురుగు మందులను ఈ డ్రోన్ల ద్వారా పిచికారి చేసేందుకు వీలుంది. డ్రోన్ల ద్వారా పిచికారి చేసే మందు నానో డోసుల్లో ఉంటుంది. దానిని తగిన మోతాదులో నింపి డ్రోన్‌లో ఉంచి వదిలితే పంటపై జెట్‌ స్పీడ్‌లో స్ప్రే చేసుకుంటూ వెళ్తుంది.  

డ్రోన్‌ ఖరీదు రూ.10 లక్షలు..  
ఒక్కో కిసాన్‌ డ్రోన్‌ ఖరీదు సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 40 శాతం ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. 50 శాతం సొమ్మును బ్యాంకుల ద్వారా రుణం లభిస్తుంది. మిగతా 10 శాతం సొమ్మును గ్రూపు రైతులు సమకూర్చుకోవలసి ఉంటుంది. పంటలకు పురుగు మందులు పిచికారీ చేసుకోదల్చుకున్న వారికి అద్దె ప్రాతిపదికన డ్రోన్లను ఇస్తారు.

చాన్నాళ్లుగా పంటల చీడపీడల నివారణకు కూలీలతో పురుగు మందులను స్ప్రే చేయిస్తున్నారు. ఈ పనికి కూలీలు ముందుకు రాని పరిస్థితి ఉంది. దీంతో రైతులు అధిక మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇది రైతుకు ఆర్థిక భారమవుతోంది. డ్రోన్లు అందుబాటులోకి వస్తే రైతులకు కూలీల బెడద తప్పుతుంది. ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలుగుతుంది.    

మరిన్ని వార్తలు