9న ఢిల్లీకి కిసాన్‌ రైలు 

3 Sep, 2020 12:49 IST|Sakshi
ఉద్యాన, మార్కెటింగ్, డీఆర్‌డీఏ అధికారులతో సమావేశమైన ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

జూమ్‌ యాప్‌ ద్వారా ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అనంతపురం:  ‘అనంత’ నుంచి ఢిల్లీకి ఈ నెల 9న కిసాన్‌ రైలు ప్రారంభమవుతుందని ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మె ల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. అనంత ఉద్యాన రైతులకు లబ్ధి చేకూరేలా ఈ బృహత్తర కార్యక్రమాన్ని రాజధాని నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కిసాన్‌రైలు అంశంపై బుధవారం స్థానిక ఏపీఎంఐపీ కార్యాలయంలో పీడీ బీఎస్‌ సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డీడీ పి.పద్మలత, ఏడీలు జి.సతీష్, జి.చంద్రశేఖర్, మార్కెటింగ్‌శాఖ ఏడీ ఎ.నారాయణమూర్తి, సెర్ఫ్‌ అధికారులతో ఎంపీ, ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ నెల 9న ఉదయం 11 గంటలకు అనంతపురం రైల్వేస్టేషన్‌ నుంచి రైల్వే వ్యాగన్‌ను సీఎం ప్రారంభించడానికి కలెక్టర్‌ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల నుంచి అక్టోబర్‌ నుంచి ప్రతిరోజూ కిసాన్‌రైలు నడపడానికి రైల్వే అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారన్నారు. అనంత నుంచి హస్తినకు వెళుతున్న తొలి కిసాన్‌రైలులో 500 టన్నుల వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులతో పాటు రైతులు, అధికారులు, కొందరు వ్యాపారులు వెళ్లడానికి ప్రత్యేకంగా స్లీపర్‌కోచ్‌ బోగీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఒక బృందం ముందే ఢిల్లీకి చేరుకుని అవసరమైన ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఉద్యాన రైతులు, అధికారులు సహకరిస్తే ‘అనంత’ కిసాన్‌రైలు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సమీక్ష అనంతరం రైల్వేస్టేషన్‌లో వసతులు పరిశీలించారు. అనంతరం కక్కలపల్లి టమాట మండీని పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడారు.    

మరిన్ని వార్తలు