ఏపీ సంబంధించిన ఒక విగ్రహాన్ని త్వరలోనే అప్పగిస్తాం: కిషన్‌రెడ్డి

11 Nov, 2021 12:40 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: దక్షిణ అయోధ్య భద్రాచలంను రామాయణ సర్క్యూట్‌లో చేరుస్తున్నామని కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. భద్రాచలం వద్ద  భక్తుల మౌలిక సౌకర్యాల కోసం అవసరమైన నిధులు మంజూరు చేస్తామని అన్నారు. భద్రాచలం విషయంపై స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైల్వే శాఖతో మాట్లాడారని తెలిపారు. రామాయణ సర్క్యూట్‌లో ఏపీలోని అంజనాద్రిని చేర్చెందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. 

దానికి సంబంధించిన ప్రతిపాదనను తమ ముందుకు వస్తే పరిశీలిస్తామని తెలిపారు. అలంపూర్ జోగులాంబ దేవాలయ అభివృద్ధికి రూ.35 కోట్ల మంజూరు చేశామని తెలిపారు. వందల ఏళ్ల కింద దేశం నుంచి కెనడా తరలిపోయిన అన్నపూర్ణ విగ్రహాన్ని యూపి ప్రభుత్వానికి అప్పగించామని పేర్కొన్నారు. 

ఏపీకి సంబంధించిన ఒక విగ్రహాన్ని త్వరలోనే రాష్ట్రానికి విగ్రహం ఇస్తామని చెప్పారు. వందల ఏళ్ల కిందట దేశం నుంచి అనేక విగ్రహాలు దేశం నుంచి బయటకు వెళ్లిపోయాయని తెలిపారు. వాటిని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు