పెరటింట..ప్రకృతి తోట

8 May, 2022 10:28 IST|Sakshi

ఖాళీ జాగాల్లో ‘కిచెన్‌’ గార్డెన్స్‌ 

సెంటు నుంచి ఐదు సెంట్ల స్థలంలో కూరగాయల పంటలు

స్వయం సహాయక సంఘాలు,గ్రామ సంఘాలతో సమన్వయం

విత్తనాలు సరఫరా చేస్తున్నప్రకృతి వ్యవసాయ విభాగం 

సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయ పంటలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇటు కూరగాయల పంటలకు అంతే ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఒక సెంటు నుంచి ఐదు సెంట్ల ఖాళీ జాగాల్లో కిచెన్‌ గార్డెన్స్, ఇంటి ఆవరణలో న్యూట్రి గార్డెన్స్, ఇంటిపైన టెర్రస్‌ గార్డెన్స్‌ పేరుతో పలు రకాల కూరగాయల పంటలను ప్రోత్సహిస్తోంది. దీనిపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిస్తోంది. ఇందుకోసం నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తోంది.
 
ప్రకృతి వ్యవసాయంలో పెరటి తోటలు
హైబ్రీడ్‌ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకానికి స్వస్తి పలికి ప్రభుత్వ సూచనలతో ప్రకృతి వ్యవసాయంవైపు మొగ్గుచూపుతున్న రైతులు అదే సమయంలో ఈ విధానంలో కూరగాయల పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. రైతులే కాకుండా భూములు లేని ప్రజలు సైతం తమ ఇళ్ల వద్దనే కొద్దిపాటి స్థలంలో ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగుకు సిద్ధమవుతున్నారు. 

జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు విభాగం సలహాలు, సూచనలతో ఈ తరహా వ్యవసాయానికి వేలాది మంది ఇప్పటికే ›శ్రీకారం చుట్టారు. కొందరు పంట పొలాల్లోనే ఇతర పంటలతోపాటు కూరగాయలు పండిస్తుండగా చాలామంది ఇళ్ల వద్దనే కూరగాయలు సాగు చేస్తున్నారు.  

ప్రకృతి వ్యవసాయ విభాగం గణాంకాల ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు 75,452 కిచెన్‌ గార్డెన్స్‌ ఏర్పాటయ్యాయి. ఇందులో భూమి లేని పేదలు 24,399 మంది తమ ఇళ్ల వద్దనే ఉన్న ఖాళీ స్థలంలో నేచురల్‌ ఫార్మింగ్‌ ద్వారా పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇక నూట్రిగార్డెన్స్‌ 274 ఉండగా, 186 టెర్రస్‌ గార్డెన్స్‌ ఉన్నాయి. ఇవన్నీ కేవలం పకృతి వ్యవసాయం పద్ధతిలో సాగు చేస్తున్న ప్లాంట్లు కావడం గమనార్హం. 

వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలోని బద్వేలు, కమలాపురం, పులివెందుల, మైదుకూరు, రాయ చోటి, రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలతోపాటు పలు నియోజకవర్గాల్లో గ్రామగ్రామాన నేచురల్‌ ఫార్మింగ్‌ కిచెన్‌ గార్డెన్స్‌ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగ ప్రాజెక్టు కృషి చేస్తోంది. 

ఈ విభా గం పరిధిలోని మాస్టర్‌ ట్రైనర్స్, ఇంటర్నల్‌ కమ్యూనిటీ సోర్స్‌ పర్సన్స్, నేచురల్‌ ఫార్మింగ్‌ అసోసియేట్స్‌ తదితర విభాగాల్లో పనిచేస్తున్న వారు గ్రామాల్లోని గ్రామ సంఘాల ద్వారా అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కిచెన్‌ గార్డెన్స్, న్యూట్రి గార్డెన్స్, టెర్రస్‌ గార్డెన్స్‌లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గార్డెన్స్‌ ఏర్పాటు చేసిన వారు 15–30 రకాల కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, బంగాళాదుంప, ఉల్లిపాయలు తదితర వాటిని ఈ తరహా వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్నారు. 

ప్రత్యేకంగా పురుగు మందులు 
ఇక పంటలకు సోకిన తెగుళ్లను నివారించేందుకు నీళ్లలో వేపాకు పిండి, పేడ, కుంకుడు కాయల పొడి తదితర వాటిని కలిపి వడగట్టి దోమపోటుతోపాటు ఇతర తెగుళ్లకు పిచికారీ చేస్తున్నారు. 

రసాయనిక ఎరువులు,పురుగు మందులు లేకుండా..
రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా కిచెన్‌గార్డెన్స్‌ను నిర్వహిస్తున్నారు.పోషకాహారం ఎరువు స్థానంలో ఘన జీవామృతం పేరుతో పేడ, పప్పుదినుసులు పిండి, నల్లబెల్లం, పుట్టమట్టి, ఆవు లేదా ఇతర పశువుల మూత్రం కలిపి ఘన జీవామృతాన్ని, ఇదే వస్తువులను నీటిలో కలిపి జీవామృతం పేరుతో డ్రిప్‌ లేదా స్ప్రింకర్ల ద్వారా ఎరువుగా పంటకు అందజేస్తున్నారు. 

ఆరోగ్యమే ప్రధానం
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల విటమిన్స్, మినరల్స్‌ అధికంగా పొందే అవకాశం ఉంటుంది. తద్వారా అనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేని కలుషిత రహిత ఆహారం తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని గార్డెన్స్‌ ఏర్పాటు చేసిన వారు పేర్కొంటున్నారు. కిచెన్‌ గార్డెన్స్‌లో పండించిన ఉత్పత్తులను అమ్ముకుంటూ ఇంటి ఖర్చులను పూడ్చుకుంటున్నట్లు పలువురు పేర్కొంటుండడం గమనార్హం. 

విటమిన్స్, మినరల్స్‌ లభ్యమవుతాయి 
ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రతి ఒక్కరూ కూరగాయల పంటలు పండించేలా చూస్తున్నాం. ఇంటిపైన ఖాళీ స్థలంలోనూ టెర్రస్‌ గార్డెన్స్‌ పేరుతో కూరగాయలు సాగు చేయిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే కూరగాయలు తినడం వల్ల విటమిన్స్, మినరల్స్‌ లభ్యమవుతాయి. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అందుకే అందరినీ ప్రోత్సహిస్తున్నాం. 
– సంధ్య,  మాస్టర్‌ ట్రైనర్, హెల్త్, న్యూట్రిషియన్, కడప 

ప్రకృతి వ్యవసాయంతోనే కూరగాయలు పండిస్తున్నాం 
మా ఇంటి వద్ద ఐదు సెంట్ల ఖాళీ స్థలంలో అన్ని రకాల కూరగాయలు, క్యారెట్, ఇతర వాటిని కూడా పండిస్తున్నాం. తోట పెట్టి నాలుగు నెలలైంది. మేము ఆరోగ్యకరమైన కూరగాయ లు తినడమే కాకుండా మిగిలిన వాటిని అమ్ముతున్నాం. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా ఎరువులు, జీవామృతం తదితర వాటితో కూరగాయలు పండిస్తున్నాం. 
–సునీత, సింగరాయపల్లె, కలసపాడు మండలం 

పెద్ద ఎత్తున పెరటి తోటల పెంపకం
జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పెద్ద ఎత్తున పెరటి తోటల పెంపకాన్ని చేపట్టారు. ఇప్పటివరకు 75 వేలకు పైగా కిచెన్‌ గార్డెన్స్‌ ఏర్పాటు చేశాం.  రైతులతోపాటు ఇళ్ల వద్ద తోటల పెంపకానికి మొగ్గుచూపే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయలు,  పండించుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగకరం.   
– రామకృష్ణరాజు, డీపీఎం,ప్రకృతి వ్యవసాయం,కడప

మరిన్ని వార్తలు