నెలాఖరులోగా ధాన్యం బకాయిలు చెల్లిస్తాం

19 Jul, 2021 03:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: ధాన్యం బకాయిల కింద కేంద్రం నుంచి రూ.5,056 కోట్లు రావల్సి ఉందని.. ఈ నెలాఖరులోగా రైతులకు బకాయిలు చెల్లిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని.. ఈనెల మూడో వారంలో రూ.1,600కోట్లు చెల్లిస్తామని చెబుతున్నారని ఆయనన్నారు. అలాగే, నాబార్డు నుంచి మరో రూ.1,600 కోట్లు రెండు, మూడ్రోజుల్లో (మంగళ, బుధవారాలు) రానున్నాయని.. ఇవన్నీ రాగానే రైతులకు చెల్లిస్తామని మంత్రి చెప్పారు. తమది ప్రతిపైసా కచ్చితంగా చెల్లించే ప్రభుత్వమని.. 21 రోజుల్లోపే బకాయిలు చెల్లించాన్నది సీఎం జగన్‌ తనకు తాను విధించుకున్న విధానమన్నారు. 2018లో చంద్రబాబు నాటి బకాయిలను రైతులకు ఎగ్గొట్టి అధికారం నుంచి దిగిపోయిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రెండేళ్లలో రూ.32వేల కోట్ల చెల్లింపు
చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో ధాన్యం కొనుగోళ్ల కింద రైతులకు ఏటా చెల్లించిన సగటు మొత్తం రూ.8,500 కోట్లు మాత్రమేనని కొడాలి నాని అన్నారు. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక, ఈ రెండేళ్లలో ఏటా రూ.16 వేల కోట్ల చొప్పున మొత్తం రూ.32 వేల కోట్లు చెల్లించామన్నారు. తాము రైతుల డబ్బు వాడుకున్నామని బాబు, కొందరు బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి  మండిపడ్డారు. అలాగే, చంద్రబాబు హయాంలో (2014–2019 వరకు) ఏటా సగటున 55 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తే.. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో ఏటా 83 లక్షల మెట్రిక్‌ టన్నుల చొప్పున ధాన్యం సేకరించామని చెప్పారు. జగన్‌ పాలనలో పండే పంటతోపాటు కొనుగోళ్లు కూడా పెరిగాయన్నారు. 

రికార్డు స్థాయిలో పదవులు
నామినేటెడ్‌ పదవుల భర్తీపై కొడాలి నాని స్పందిస్తూ.. ఒకేసారి 137 కార్పొరేషన్‌ పదవులు భర్తీచేసి సీఎం జగన్‌ చరిత్ర సృష్టించారన్నారు. చంద్రబాబు ఏనాడూ ఒకేసారి ఇలా కార్పొరేషన్‌ పదవులు ప్రకటించలేదన్నారు. సామాజిక న్యాయం అంటే, బాబు కేవలం తన సామాజికవర్గానికే న్యాయం చేశారని ఎద్దేవా చేశారు. బాబుకు 2024లో విపక్ష హోదా కూడా రాదని.. అందుకే బిజేపీతో జత కట్టాలని చూస్తున్నారన్నారు. టీడీపీని బీజేపీలో కలిపేస్తే సరి అని నాని వ్యాఖ్యానించారు. మరోవైపు.. బీజేపీ నేతలు అర్ధంపర్ధంలేని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని.. ఆ పార్టీకి రాష్ట్రంలో డిపాజిట్‌ కూడా రాదన్నారు. రాష్ట్రంలో ఓ మంత్రికి రూ.3 కోట్లతో కొందరు ఇల్లు కట్టించి ఇచ్చారంటున్నారని, ఆ వివరాలు చెబితే, ప్రభుత్వమే దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

రైతులు ఆందోళన చెందొద్దు
రైతులకు మొత్తం రూ.3,393 కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇందులో 21 రోజులు దాటిన తర్వాత చెల్లించాల్సిన మొత్తం కేవలం రూ.1,204 కోట్లు మాత్రమేనన్నారు. రైతులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభివృద్ధి–సంక్షేమంతో ముందుకు సాగుతుంటే, రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించడంలేదని చంద్రబాబు అర్థంపర్థంలేని విమర్శ చేస్తున్నారని నాని మండిపడ్డారు. బాబు తానా అంటే ఆయన అనుకూల మీడియా తందనా అంటూ విషప్రచారం చేస్తోందని విరుచుకుపడ్డారు. తన పార్టీ నేతలనే రైతులుగా చూపిస్తూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఈ నెలాఖరులోగా రైతుల బకాయిలన్నీ చెల్లిస్తామని మంత్రి స్పష్టంచేశారు. 

మరిన్ని వార్తలు