27న తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

26 Dec, 2022 05:35 IST|Sakshi
ఆలయం వెలుపల కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ , మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే

ఆ రోజు బ్రేక్‌  దర్శనాలు రద్దు

నేడు సిఫార్సు లేఖలకు అనుమతి లేదు 

తిరుమల: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 6–10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహిస్తారు. ఆనందనిలయం, బంగారువాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు.

ఈ సమయంలో మూలవిరాట్టును వస్త్రంతో కప్పుతారు. శుద్ధి అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్య కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా మంగళవారం బ్రేక్‌  దర్శనాలను  రద్దు చేశారు. సోమవారం సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ తెలిపింది.  

శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ 
శ్రీవారిని ఆదివారం కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి రాజ్‌కుమార్‌ సింగ్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఇందిరేష్, జస్టిస్‌ నరేంద్ర ప్రసాద్, ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకిషన్‌ అగర్వాల్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జె.శ్రీనివాసరావు, బీఎస్‌ఎఫ్‌ డీజీ పంకజ్‌ కుమార్‌ సింగ్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు, మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే దర్శించుకున్నారు. 

సర్వదర్శనానికి 24 గంటలు
తిరుమలలో 14 క్యూ కంపార్ట్‌మెంట్‌లు నిండాయి.సర్వ దర్శన టోకెన్లు లేని వారికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు పడుతోంది. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో చాలా దుకాణాలు మూతపడ్డాయి.   

మరిన్ని వార్తలు