కొల్లేరు సరస్సు రీసర్వేకు రంగం సిద్ధం

28 Jun, 2022 18:40 IST|Sakshi

రూ. 4 కోట్ల అంచనా వ్యయం

70 వేల ఎకరాల మిగులు భూమి వెల్లడయ్యే అవకాశం

కాంటూర్ల వారీగా సర్వే ప్రక్రియ

గణపవరం సభలో రీసర్వేపై ప్రకటన చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

రీసర్వేతో కొల్లేరులోని కుటుంబాలకు మేలు

5వ కాంటూరు వరకు 77,340 ఎకరాల అభయారణ్యం ఉన్నట్టు నిర్ధారణ 

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు రీసర్వేకు రంగం సిద్ధమైంది. దశాబ్దాలుగా కొల్లేరులో ఆక్రమణలకు గురై వెలుగులోకి రాని భూములు వేల ఎకరాలు ఉన్నాయి. చెరువుల సాగుకు అనుకూలమైన భూములైనప్పటికీ ఆక్రమణల పర్వంతో స్థానిక కొల్లేరు ప్రజలకు మాత్రం నిరుపయోగంగా మారాయి. ఈ క్రమంలో కొల్లేరు రీసర్వే డిమాండ్‌ సుదీర్ఘకాలంగా ఉంది. దీంతో కొల్లేరు ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల ఆకాంక్ష మేరకు కొల్లేరు రీసర్వే చేయిస్తామని గత నెలలో గణపవరంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో సర్వేపై అధికారులు వేగంగా దృష్టి సారించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు.  

సర్వే ప్రక్రియ ఇలా 
కొల్లేరు అభయారణ్యంలో నిర్వహించనున్న సర్వే ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అటవీ శాఖాధికారులు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.4 కోట్ల వ్యయంతో సర్వే నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్వే ప్రక్రియను జలవనరుల శాఖ పర్యవేక్షించింది. రాడార్‌ ల్యాండ్‌ సర్వే ద్వారా కొల్లేరు భూముల విస్తీర్ణం లెక్క తేల్చనుంది. అభయారణ్యం ఉపరితలంపై రాడార్‌ను అమర్చి డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించనుంది. ఒక్కొక్క కాంటూరు పరిధిలో అభయారణ్యం భూములు ఎంత ఉన్నాయి.. జిరాయితీ భూములు ఎంత ఉన్నాయి.. అనధికారిక చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి.. ఆక్రమణ భూములు ఎంత ఉన్నాయి ఇలా కాంటూరుల వారీగా అభయారణ్యం విస్తీర్ణం పక్కాగా లెక్క తేలనుంది.

సర్వే ద్వారా ఐదో కాంటూరు లోపే సుమారు 70 వేల ఎకరాల భూమి వెలుగులోకి వస్తుందని, దీనిలో 55 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 10 వేల ఎకరాలు జిరాయితీ భూమి ఉంటుందని అధికారిక అంచనా. ఐదో కాంటూరు వరకు అభయారణ్యంలో 77,340 ఎకరాల భూమి ఉన్నట్టు అటవీ శాఖ రికార్డులు చెబుతున్నాయి. రాడార్‌ సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక సిద్ధం చేసి అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం అనుమతితో వచ్చే నెలాఖరు నాటికి సర్వే ప్రక్రియ జిల్లాలో ప్రారంభం కానుంది. మరోవైపు స్వచ్ఛ కొల్లేరుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రూ.420 కోట్ల వ్యయంతో మూడు చోట్ల రెగ్యులేటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రెగ్యులేటర్ల నిర్మాణం ద్వారా సముద్రం నుంచి వచ్చే ఉప్పు నీటితో కొల్లేరు కలుషితం కాకుండా కట్టడి చేయనున్నారు.  

సర్వేతో వెలుగులోకి అభయారణ్య, జిరాయితీ భూములు..  
మంచినీటి సరస్సుగా కొల్లేరు ప్రపంచ ఖ్యాతిగాంచింది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 901 చదరపు కిలోమీటర్ల మేర 2,22,300 ఎకరాల్లో ఉన్న కొల్లేరు రెండు జిల్లాల్లో 12 మండలాల్లో విస్తరించి ఉంది. కొల్లేరుపై ఆధారపడి మూడున్నర లక్షల మంది జీవిస్తున్నారు. 1959లో కొల్లేరులో చేపల సాగుకు ప్రభుత్వం మొదటగా అనుమతినిచ్చింది. అప్పటి నుంచి క్రమక్రమంగా చేపల సాగు పెరిగి వేల ఎకరాలకు చేరింది. కొల్లేరు సర్వే వల్ల అభయారణ్య భూములు, జిరాయితీ భూములు వెలుగులోకి రానున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కొల్లేరు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2007లో కొల్లేరులో ప్రక్షాళనలో భాగంగా సుమారు 55 వేల ఎకరాల అనధికారిక చెరువులు కొట్టేసి సాగుదారులకు రూ.55 కోట్ల మేర పరిహారం అందించారు. 2005లోనే సుప్రీంకోర్టు నియమించిన సాధికారిక కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిత్రా కమిటీలు కొల్లేరులో పర్యటించి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదికలు అందించాయి. వాటి ఆధారంగానే కొల్లేరు ప్రక్షాళనకు దివంగత వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కైకలూరు పరిసర ప్రాంతాల్లో అభయారణ్యంలో 7500 ఎకరాల భూమి వెలుగులోకి వచ్చింది.  

సమగ్ర సర్వే నిర్వహిస్తాం 
ప్రభుత్వ ఆదేశాలతో కొల్లేరు రీసర్వేకు ప్రతిపాదనలు, సర్వే నిర్వహించాల్సిన క్రమం, ఇతర అంశాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. రూ.4 కోట్ల వ్యయంతో సర్వే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అభయారణ్యం భూముల లెక్క తేల్చి ప్రభుత్వానికి నివేదిస్తాం.  
– ఎస్‌వీకే కుమార్, ఏలూరు అటవీ శాఖ రేంజర్‌ 

మరిన్ని వార్తలు