రిపబ్లిక్‌ చిత్రంపై కొల్లేరు ప్రజల ఆగ్రహం

6 Oct, 2021 04:11 IST|Sakshi
జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న కొల్లేరు నాయకులు

తమను కించపరిచారని జాయింట్‌ కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు 

చిత్ర దర్శక, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ 

ఏలూరు రూరల్‌/కైకలూరు: ‘రిపబ్లిక్‌’ చిత్ర ప్రదర్శనపై పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనోభావాలను కించపరిచేలా సినిమాను చిత్రీకరించిన దర్శకుడు, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏలూరులో ర్యాలీ నిర్వహించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. వడ్డి కుల సంక్షేమ సంఘం నాయకుడు ముంగర సంజీవ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. కొల్లేరు ప్రజలు విషపూరిత రసాయనాలతో చేపల సాగు చేస్తున్నట్లుగా సినిమాలో చూపించడం దారుణమన్నారు. దీనివల్ల చేపల సాగుపై ఆధారపడి జీవిస్తున్న స్థానిక ప్రజలు ఆర్థికంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆక్వా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే.. అసత్యాలతో సినిమా తీయడం దారుణమని రాష్ట్ర వడ్డి కుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సైదు గాయత్రి సంతోషి అన్నారు. వెంటనే తమ ప్రాంతం గురించి చిత్రీకరించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలిగించాలని రాజన్న కొల్లేరు సంఘం చైర్మన్‌ మండల కొండలరావు డిమాండ్‌ చేశారు. చిత్ర ప్రదర్శన నిలిపివేయకపోతే ఆందోళన చేస్తామని ఏపీ ఫారెస్ట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పల్లెం ప్రసాద్‌ హెచ్చరించారు. సినిమా అనేది ప్రజల జీవన స్థితిగతులు పెంచేలా ఉండాలని ఎంపీపీ పెనుమత్స శ్రీనివాసరాజు సూచించారు.

కొల్లేరు ప్రజలను కించపరిచేలా సినిమాలు తీస్తే గట్టిగా బుద్ధి చెబుతామని కలకుర్రు, ప్రత్తికోళ్లలంక, పైడిచింతపాడు సర్పంచ్‌లు ఘంటసాల నాగప్రసాద్, ఘంటసాల మహలక్ష్మీరాజు, ముంగర తిమోతి, ప్రసాద్‌ తదితరులు హెచ్చరించారు. కైకలూరు, కొల్లేటి కోటలో కూడా ఆందోళన చేపట్టారు. రిపబ్లిక్‌ సినిమా ప్రదర్శిస్తున్న వెంకటరమణ థియేటర్‌ వద్ద హైవేపై నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, తహసీల్దారు సాయి కృష్ణకుమారికి కొల్లేరు సంఘ జిల్లా అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో వినతి పత్రాలిచ్చారు. నిరసనల్లో నాయకులు జయమంగళ కాసులు, మల్లికార్జునరావు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు