నాపై ఈటీవీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసింది: కొమ్మినేని

6 Jan, 2023 19:57 IST|Sakshi

ఇదేం పచ్చపైత్యం?

ఈనాడు, ఈటీవీలను తప్పుబట్టిన కొమ్మినేని

ప్రెస్‌ ఆకాడమీ ఛైర్మన్‌పైనే తప్పుడు రాతలా?

సాక్షి, ప్రకాశం జిల్లా: కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై పరిశీలన కోసం ఏపీ ప్రెస్‌ ఆకాడమీ ఛైర్మన్‌గా తాను వెళితే అబద్దాలు సృష్టించి వార్తలు అల్లిందని ఈనాడు గ్రూపుపై మండిపడ్డారు కొమ్మినేని శ్రీనివాసరావు. కందుకూరులో తొక్కిసలాటకు చంద్రబాబు వైఖరి కారణమని ప్రపంచమంతా చెబుతున్నా.. అసలు వాస్తవాన్ని వక్రీకరిస్తూ.. ఈనాడు సంపాదకీయంలో పోలీసుల వైఫల్యం వల్ల తొక్కిసలాట జరిగిందని రాశారని, దాని నిజనిజాలు తేల్చేందుకు కందుకూరు ఘటనాస్థలిని పరిశీలించానని కొమ్మినేని తెలిపారు.

అనంతరం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించగా... కొందరు ఈనాడు విలేకరులు ప్రశ్నలు వేశారని, దానిని వక్రీకరించి కొమ్మినేనికి కాక అంటూ ఓ అబద్దాన్ని, అసత్యాన్ని సృష్టించి ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారని తెలిపారు ప్రెస్‌ ఆకాడమీ ఛైర్మన్‌ కొమ్మినేని. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి పార్టీ ఫిరాయించేలా చేస్తే.. దాన్ని సమర్థించిన ఈనాడుకు నేడు ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధంగా కనిపించిందా? అని ప్రశ్నించారు. 

నిజంగా ఈనాడు, ఈటీవీకి జర్నలిజం దమ్ముంటే.. రాసిన వార్తకు కట్టుబడి ఉంటే.. తన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ మొత్తం వీడియో ప్రసారం చేయాలని కొమ్మినేని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. దీని ద్వారా ప్రజలందరికీ నిజనిజాలు తెలుస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఈనాడు తీరు చూస్తుంటే.. విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్టే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామీణ విలేకరులకు అవగాహన తరగతులు
అనంతరం కావలికి వచ్చిన కొమ్మినేని.. ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయ మిత్రులతో సమావేశమయ్యారు. ఈ జర్నలిజంలో మౌలిక సూత్రాలు, విలువలు గురించి గ్రామీణ విలేకరులకు ప్రతి జిల్లాలో అవగాహన తరగతులు నిర్వహిస్తామన్నారు. వివిధ మాధ్యమాలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మీడియాలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవగాహన తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

అదే విధంగా యూనివర్సిటీలలో జర్నలిజం డిప్లొమా కోర్సులలో  ప్రస్తుతం ఉన్న సిలబస్‌ను కుదించి, ఆచరణాత్మకంగా ఉండేట్లుగా కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలని, వాస్తవ అవాస్తవాలను పరిశీలించిన మీదటే వార్తలు రాయాలన్నారు. జర్నలిజం పేరుతో వ్యక్తిగత విధ్వంసకర దాడి సరికాదన్నారు. విలువల గురించి ప్రచారం చేయాలన్నారు.
చదవండి: ఎందుకీ వెకిలి రాతలు.. ‘ఈనాడు’ ఎవరి కోసం పనిచేస్తోంది? 

కొమ్మినేని శ్రీనివాసరావును సత్కరించిన పాత్రికేయులు
సమావేశం తర్వాత ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును పాత్రికేయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కె శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి, వెంకట్రావు, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి వెంకటేశ్వర ప్రసాద్, పాత్రికేయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు