ఎవరి బియ్యం కార్డూ రద్దు కాదు

19 Aug, 2021 03:15 IST|Sakshi

ఆధార్‌ సెంటర్లకు పరుగులు పెట్టొద్దు 

పేరు నమోదు చేసుకున్న రోజు నుంచే బియ్యం ఇస్తారు 

80 శాతం మార్పులు చేర్పులు మీ వలంటీర్, వీఆర్వో వద్దే 

పౌర సరఫరాల సంస్థ కమిషనర్‌ కోన శశిధర్‌ విజ్ఞప్తి 

సాక్షి, అమరావతి:  ఆధార్‌ కార్డుతో ఎలక్ట్రానిక్‌ పద్ధతిన వినియోగదారుల రేషన్‌ కార్డుల అనుసంధానం (ఈ–కేవైసీ) కోసం హైరానా పడాల్సిన పని లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ స్పష్టం చేశారు. బియ్యం కార్డుల్లోని పేర్ల అనుసంధానం కోసం ఆధార్‌ సెంటర్లకు పోవాల్సిన పని లేదని, సమీపంలోని వలంటీర్లను, వీఆర్వోలను సంప్రదిస్తే సరిపోతుందని ఆయన బుధవారం ‘సాక్షి’కి చెప్పారు. 80 శాతానికి పైగా సమస్యలు వలంటీర్లు, వీఆర్వోల వద్దనే పరిష్కారం అవుతాయని వివరించారు. ఎవరి కార్డులూ రద్దు కాబోవని, ఆధార్‌తో అనుసంధానం అయిన రోజు నుంచే బియ్యం తీసుకోవచ్చన్నారు. ఏ లబ్ధిదారుడికీ బియ్యం ఎగ్గొట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. వలంటీర్లను, వీఆర్వోలను సంప్రదించిన తర్వాతే ఆధార్‌ సెంటర్లకు వెళ్లాలని సలహా ఇచ్చారు. కొత్తగా ఆధార్‌ కార్డు కావాల్సిన వారో, ఇతరత్రా మార్పులు చేర్పులు చేయించుకోదలచిన వారు మాత్రమే ఆధార్‌ సెంటర్లకు వెళ్లాలన్నారు.  

కోవిడ్‌ జాగ్రత్తలు పాటించాలి 
ఆధార్‌ సెంటర్ల వద్ద జనం గుమికూడకుండా కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లను కోరినట్టు కోన శశిధర్‌ తెలిపారు. రాష్ట్రంలో రేషన్‌ లబ్ధిదారులందరితో ఈకేవైసీ నమోదు చేయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని, దానికనుగుణంగానే తామూ రెవెన్యూ శాఖ ద్వారా నోటీసులు ఇప్పించి గడువు పెట్టామని వివరించారు. ‘రాష్ట్రంలో సుమారు 1.48 కోట్ల బియ్యం కార్డుల ద్వారా 4.31 కోట్ల మంది వరకు లబ్ధి పొందుతున్నారు. వీరిలో 85 శాతం మంది ఈ–కేవైసీ చేసుకున్నారు. ఇంకా 35 లక్షల మంది నమోదు చేయించుకోవాల్సి ఉంది.

వీరిలో ఇప్పటికి 12 లక్షల మంది చేయించుకున్నారు. ఈ నెలాఖరులోగా మరికొంత మంది చేయించుకుంటారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్‌తో అనుసంధానం అవసరం లేదు. ఆపై వయసున్న పిల్లలకు సెప్టెంబర్‌ వరకు గడువు ఉంది. పెద్దలు మాత్రం ఆగస్టు నెలాఖరులోగా చేయించుకోవాలి.’ అని శశిధర్‌ కోరారు. రేషన్‌ కార్డుల్లో పేర్లున్న వారికే ఆధార్‌తో అనుసంధానం అవసరమన్నారు. వేలి ముద్రలు పడని వారు కూడా ఆధార్‌ సెంటర్లకు పోవాల్సిన పని లేదని, సమీపంలోని చౌకధరల దుకాణం లేదా ఎంపీడీవోల వద్ద ఉండే ఈ–పాస్‌ యంత్రాల్లో వేలి ముద్రలు వేయవచ్చన్నారు. రెండు చేతులకూ కలిపి 70, 80 శాతం వేలి ముద్రలు సరిపోలితే చాలని వివరించారు.   

మరిన్ని వార్తలు