పిల్లలకు కోనసీమ జిల్లా కలెక్టర్‌ పాఠాలు

9 Apr, 2022 14:28 IST|Sakshi
చిన్నారిని ఒడిలో కూర్చోపెట్టుకుని మాట్లాడుతున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

బండారులంక కందులపాడు కాలనీ

అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ

విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్‌

రిజిస్టర్లు, పౌష్టికాహారం పరిశీలన 

అమలాపురం రూరల్‌: కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా శుక్రవారం అంగన్‌వాడీ విద్యార్థులకు అక్షరాలు నేర్పించారు. వారిని ముద్దాడి.. వారితో ముచ్చటించి, ఆడి పాడి మురిపించారు. బండారులంక కందులపాడు కాలనీలో అంగాన్‌వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేసి పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పరిశీలనలో భాగంగా కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, కోడిగుడ్ల నాణ్యతను పరిశీలించారు. చిన్నారులను ఒడిలో కూర్చో పెట్టుకుని ముచ్చటించారు. 

అక్షరాలు, చిన్నచిన్న పదాలు వారితో చెప్పించి రాయించే ప్రయత్నం చేశారు. కేంద్రంలో వారికి పెడుతున్న ఆహారాన్ని అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లు తనిఖీ చేశారు. చిన్నారుల వయసుకు తగిన బరువు ఉన్నదీ లేనిదీ నేరుగా పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రం వద్ద వాతావరణం ఆహ్లాదంగా ఉండాలని, పిల్లల మానసిక అంశాలను గమనిస్తూ ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో నిరంతరం  పరిశీలించి పథకాల అమలుపై పర్యవేక్షిస్తామని ఆయన కేంద్రం నిర్వాహకులకు తెలిపారు. కలెక్టర్‌ వెంట సర్పంచ్‌ పెనుమాల సునీత, అంగన్‌వాడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు