పర్ర భూములను చెరబడుతున్న ఆక్వా చెరువులు

20 Jun, 2022 17:48 IST|Sakshi

మొగలకు ఇరువైపులా 6 వేల ఎకరాల పర్ర భూమి

సుమారు 2,130 ఎకరాల్లో ఆక్రమణలు.. అక్రమంగా ఆక్వా చెరువులు

కొల్లేరు తరహాలోనే ధ్వంసం చేయాలంటున్న నిపుణులు

సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): వేలాది ఎకరాల పంట భూముల నుంచి ముంపు నీరు, ఇతర డ్రెయిన్ల నీరు దిగడానికి సముద్రపు మొగలు ఎంతో అవసరం. సరిగ్గా ఇక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసి, అక్రమంగా ఆక్వా చెరువులు ఏర్పాటు చేయడంతో మొగలు పూడుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా వేలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడి, కోనసీమ రైతులు భారీగా నష్టపోతున్నారు. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌), మద్రాస్‌ కన్జర్వెన్స్‌ యాక్టులను తోసిరాజని మరీ పర్ర భూముల్లో ఆక్వా చెరువులు తవ్వేస్తున్నా.. వేలాది ఎకరాల వరి ఆయకట్టు ముంపునకు కారణమవుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కొల్లేరు ఆపరేషన్‌ తరహాలో అక్రమ చెరువులను ధ్వంసం చేసి, రెగ్యులేటర్లు నిర్మిస్తేనే ఇక్కడ ముంపు సమస్యకు మోక్షం కలుగుతుందని ఇరిగేషన్‌ నిపుణులు, రైతులు చెబుతున్నారు. 

పులికాట్, కొల్లేరు తరహాలోనే కోనసీమలోని కాట్రేనికోన మండలం వృద్ధ గౌతమి నదీపాయ నుంచి అల్లవరం మండలం వైనతేయ నదీపాయ వరకూ సుమారు 6 వేల ఎకరాల్లో పర్ర భూములున్నాయి. మధ్య డెల్టాలో 1.72 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. రామేశ్వరం, కూనవరం మొగల ద్వారా సుమారు 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 45 వేల ఎకరాలు వరి ఆయకట్టు ఉంది. మిగిలింది ఆక్వా చెరువులుగా మారిపోయింది. మొత్తం 45 వేల ఎకరాల ఆయకట్టు ముంపు నీరు ఈ మొగల ద్వారానే దిగాల్సి ఉంది. అయితే మొగలు పూడుకుపోవడం, వీటిని తెరచినా ముంపునీరు దిగకపోవడంతో రైతులు ఏటా రూ.60 కోట్ల మేర పంటలు నష్టపోతున్నారని అంచనా. 


పర్ర భూముల కబ్జా 

మొగల ద్వారా నేరుగా సముద్రంలోకి నీరు దిగే అవకాశం తక్కువ. భారీ వర్షాల సమయంలో ముంపునీరు రామేశ్వరం, కూనవరం డ్రెయిన్ల నుంచి పర్ర భూముల్లోకి వెళ్లేది. కూనవరం డ్రెయిన్‌ నీరు చిర్రయానం పర్ర భూమి ద్వారా వెళ్లి పల్లం, నీళ్లరేవు, ఏటిమొగ వద్ద సముద్రంలోకి వెళ్లేది. దీనివల్ల భారీ వర్షాల సమయంలో చేలు ముంపు బారిన పడినా రెండు మూడు రోజుల్లోనే నీరు తీసేది. కొన్నేళ్లుగా పర్ర భూముల్లో పెద్ద ఎత్తున ఆక్వా చెరువులు ఏర్పాటయ్యాయి. రామేశ్వరం పర్ర భూముల్లో 480 ఎకరాలు, ఎస్‌.యానాం, చిర్రయానాం పర్ర భూముల్లో సుమారు 1,650 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. సుమారు 2,130 ఎకరాల భూమి కబ్జాల బారిన పడటంతో డ్రెయిన్ల ద్వారా వస్తున్న ముంపునీరు పర్ర భూముల్లోకి వెళ్లే సామర్థ్యం పడిపోయింది. ఆక్వా చెరువుల వల్ల ముంపునీరు పర్రభూముల ద్వారా కాకుండా మొగల ద్వారానే సముద్రంలో కలవాల్సి వస్తోంది. ఇసుక మేటలు వేయడంతో మొగల వెడల్పు కుదించుకుపోతోంది. కూనవరం స్ట్రెయిట్‌ కట్‌ ద్వారా 25 క్యూమిక్స్‌ (క్యూబిక్‌ మీటర్‌ పర్‌ సెకన్‌) నీరు సముద్రంలోకి దిగాల్సి ఉండగా, మొగ తెరచిన తరువాత కూడా 10 క్యూమిక్స్‌ కూడా దిగడం లేదు.


కొల్లేరు తరహాలోనే..

పూర్వపు పశ్చిమ, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సులో కబ్జాలు చేసి, ఏర్పాటు చేసిన ఆక్వా చెరువులను నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ధ్వంసం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అక్కడ రూ.412 కోట్లతో మూడుచోట్ల రెగ్యులేటర్లు నియమిస్తున్నారు. ఇదేవిధంగా పర్ర భూముల్లోని ఆక్రమణలను సైతం తొలగించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. మొగల పరిస్థితిపై గతంలో కూనా ఓషనోగ్రఫీ, ఉస్మానియా ఓషనోగ్రఫీ విభాగాలు సర్వేలు చేశాయి. డ్రెయిన్‌ నుంచి మొగ దాటుకుని సముద్రంలోకి 200 మీటర్ల మేర లాంగ్‌ రివిట్‌మెంట్లు నిర్మించాలని సూచించాయి. వీటికి ఆటోమెటిక్‌ రెగ్యులేటర్లు నిర్మించాలని సిఫారసు చేశాయి. డ్రెయిన్‌లో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు తెరచుకునేలా.. సముద్రం పోటు సమయంలో మూసుకుపోయేలా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రకారం రెగ్యులేటర్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. 


అనధికార చెరువులపై చర్యలు 

పర్ర భూముల్లో అనధికారికంగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అలాగే పంచనదిని ఆనుకుని కూడా చెరువులున్నాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. 
– ఆర్‌.నాగార్జున,డీఈఈ, డ్రెయిన్‌ అమలాపురం 


మొగల స్వరూపమిదీ.. 

కూనవరం ప్రధాన మురుగు కాలువ ద్వారా ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లోని సుమారు 35 వేల ఎకరాల్లోని ముంపునీరు దిగాల్సి ఉంది. రంగరాజు, ఓల్డ్‌ సమనస, అయినాపురం, గొరగనమూడి మీడియం డ్రెయిన్ల నీరు కూడా దీని ద్వారానే వస్తోంది. 1996 తుపాను సమయంలో దీనికి గండి పడింది. తరువాత ఏప్రిల్‌ నుంచి జూలై వరకూ పూడుకుపోయి, మిగిలిన సమయంలో అప్పుడప్పుడు కొద్దిమేర తెరచుకుంటోంది. 
     
అల్లవరం మండలం రామేశ్వరం మొగ ద్వారా వాసాలతిప్ప, పంచనది డ్రెయిన్ల నుంచి వస్తున్న ముంపునీరు దిగుతోంది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల్లోని ముంపునీరు దీని ద్వారా దిగాల్సి ఉంది. ముంపునీరు రామేశ్వరం మొగ వద్దకు వచ్చి ఇక్కడున్న పర్ర భూమిలోకి చేరుతోంది. అక్కడి నుంచి కిలోమీటరు ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. (క్లిక్‌: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న)

మరిన్ని వార్తలు