Konaseema Issue: అమలాపురానికి అదనపు బలగాలు.. నిలిచిపోయిన బస్సులు

25 May, 2022 08:49 IST|Sakshi

సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదనపు బలగాలను పోలీసులు మోహరించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి ప్రత్యేక దళాలను అధికారులు తరలించారు. అమలాపురంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమ బస్సు సర్వీసులను రద్దు చేశారు. అమలాపురంలో పరిస్థితి అదుపులోకి తెచ్చామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. డీఐజీ, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఆందోళనలపై విచారణ చేపడతామని డీజీపీ పేర్కొన్నారు.
చదవండి: అంబేడ్కర్‌ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'!

‘సాక్షి’తో  ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు మాట్లాడుతూ, అమలాపురంలో ఆందోళనల్లో పాల్గొని విధ్వంసం సృష్టించిన వారిని గుర్తిస్తున్నామని, ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకూడదని అమలాపురంలో కర్ఫ్యూ విధించడం లేదన్నారు.

కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయాయి. పక్కా స్కెచ్‌తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్‌ చేసుకుంటూ పెట్రేగిపోయాయి. ఇది కొన్ని కులాలు, వర్గాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావటంతో పోలీసులు పూర్తిస్థాయిలో సంయమనం పాటించగా... దాన్ని అలుసుగా తీసుకున్న ఆ వర్గాలు విచ్చలవిడిగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల్ని ధ్వంసం చేశాయి.

మరిన్ని వార్తలు