కళల కాణాచి.. జీవమై మెరిసి

13 Mar, 2022 08:56 IST|Sakshi

కొండపల్లి బొమ్మ.. అనంతపురం తోలుబొమ్మ 

గుంటూరు రాతి శిల్పాలు.. పెడన కలంకారీ 

చిలకలపూడి రోల్డ్‌ గోల్డ్‌ నగలు.. నరసాపురం లేసు అల్లికలు మన స్పెషల్‌ 

రాష్ట్రంలో 2 లక్షల కుటుంబాలకు హస్తకళలే జీవనాధారం 

సాక్షి, అమరావతి: కొండపల్లి అడవిలో లభించే తెల్ల పొనుకు చెట్ల నుంచి సేకరించిన చెక్కతో కొండపల్లి హస్త కళాకారులు తయారు చేసే ఎడ్లబండి, కల్లుగీత తాటి చెట్టు, ఏనుగు అంబారీ, దశావతారాలు, అర్జునుడి రథం, దేవతామూర్తుల బొమ్మలు దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందాయి. టేకు చెక్కతో అత్యంత నైపుణ్యంతో చేసే కలంకారీ అచ్చులకు ఉన్న ప్రత్యేకత అంతాఇంతా కాదు.

చీరలు, దుప్పట్లు, లుంగీలు, చొక్కాలు, బ్లౌజులపై ఈ అచ్చుల సాయంతో అద్దే డిజైన్లకు మంచి క్రేజ్‌ ఉంది. విదేశాల నుంచి సైతం ప్రత్యేకంగా ఆర్డర్‌పై కలంకారీ అచ్చులను తయారు చేయించుకుని వెళ్తుండటంతో వీటికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. కొండపల్లి బొమ్మ.. అనంతపురం తోలుబొమ్మ.. గుంటూరు రాతి శిల్పాలు.. పెడన కలంకారీ.. చిలకలపూడి రోల్డ్‌ గోల్డ్‌ నగలు.. నరసాపురం లేసు అల్లికలు వంటి ఎన్నో హస్త కళలు మన సొంతం.

జగమంతా మోగిన బొబ్బిలి వీణ.. కొండపల్లి కొయ్య బొమ్మ.. ఏటికొప్పాక లక్క బొమ్మలు.. గోదావరి తీరంలో అల్లే లేసులు.. ఏలూరు ఎర్ర తివాచీలు.. పుత్తడిని తలదన్నే బుడితి ఇత్తడి సామానులు.. ఆళ్లగడ్డ, దుర్గి శిల్పాలు.. చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో చెక్కలపై చెక్కే అందాలు మన ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన వార సత్వ హస్త కళా సంపద. వీటిలో ఏ కళ వైపు చూసినా వాటికి పురుడు పోసే హస్తకళాకారుల చేతులు చమత్కారం చేస్తుంటాయి. భళా.. హస్తకళ అనిపించుకుంటాయి. 

2 లక్షల కుటుంబాలకు హస్తకళలే ఆధారం 
రాష్ట్రంలో హస్త కళలపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో ఒక్కో హస్తకళ ప్రత్యేకతను సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షలకు పైగా కుటుంబాలు హస్తకళలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంత మహిళలు సూది, దారాలతో అలవోకగా అల్లే లేసులు, ఏలూరులో తివాచీల తయారీపై ఆధారపడి అత్యధికంగా లక్ష మందికి పైగా ఉపాధి పొందుతున్నారు.

ఆ తరువాత కృష్ణా జిల్లాలోని పెడన కలంకారీ అచ్చుల తయారీ, బం దరులోని చిలకలపూడి బంగారం, కొండపల్లి కొయ్య బొమ్మల తయారీపై ఉపాధి పొందుతున్న వారి సంఖ్య రెండో స్థానంలో ఉంది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రాంతంలో లేసు అల్లికలు, రామచంద్రపురం తాటి ఆకుల కళాఖండాలు, చిత్తూరులో చెక్క కళాకృతులను బతికిస్తున్న హస్త కళాకారుల సంఖ్య మూడో స్థానంలో ఉంది.

కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన ఇతడి పేరు కె.వెంకటాచారి. 35ఏళ్లుగా కొయ్య బొమ్మల తయారీలో నిమగ్నమయ్యాడు. ఈ కళనే జీవనోపాధిగా మలుచుకున్న వెంకటాచారి తన ఇద్దరు కొడుకుల్ని బాగా చదివించి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేశాడు. ఇటీవల ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ఇచ్చి గౌరవించింది. ఇటీవల ‘మన్‌కీ బాత్‌’లో ప్రధాని మోదీ సైతం కొండపల్లి బొమ్మల తయారీని ప్రస్తావించడంతో వెంకటాచారి పులకించిపోతున్నాడు. 

అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన పెడన కలంకారీ అచ్చుల తయారీలో 40ఏళ్లుగా సేవలందిస్తున్నఈయన పేరు కొండ్రు గంగాధర్‌. కృష్ణా జిల్లా పెడనకు చెందిన గంగాధర్‌ కుటుంబం మొత్తం ఇదే కళపై ఆధారపడి జీవిస్తోంది. ఎంతో మందికి కలంకారీ అచ్చుల తయారీలో శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించిన గంగాధర్‌ను కేంద్ర ప్రభుత్వం 2002లో రాష్ట్రపతి పురస్కారంతో సత్కరించింది. గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘శిల్పగురు’ అవార్డు ఇంకా అందుకోవాల్సి ఉందని గంగాధర్‌ గర్వంగా చెబుతున్నాడు. కళల కాణాచిగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో ఎందరో కళాకారులు హస్త కళలనే నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు. తాము బతుకుతూ హస్త కళలను బతికిస్తున్నారు. 

తాతల కాలం నుంచీ చేస్తున్నాం 
మా తాతల కాలం నుంచి చిలకలపూడిలో రోల్డ్‌ గోల్డ్‌ ఆభరణాలు (ఇమిటేషన్‌ నగలు) తయారు చేస్తున్నాం. నేను మా నాన్న దగ్గర రోల్డ్‌గోల్డ్‌ నగల తయారీ నేర్చుకుని ఇదే పనిలో స్థిరపడ్డాను. మా ఇద్దరు పిల్లల చదువులు పూర్తయ్యాక వారితో రోల్డ్‌ గోల్డ్‌ నగల వ్యాపారం పెట్టించాను. ఈ వృత్తిని నమ్ముకున్న మాకు ఎలాంటి కష్టం లేదు. మచిలీపట్నంలో దాదాపు 3 వేల కుటుంబాలు రోల్డ్‌ గోల్డ్‌ నగల తయారీపై ఆధారపడి బతుకుతున్నాయి.  
– పెద్దేటి పాండురంగారావు, రోల్డ్‌ గోల్డ్‌ ఆభరణాల తయారీదారు, మచిలీపట్నం 

అమ్మ నుంచి నేర్చుకున్నా 
మా అమ్మ చంద్రమ్మ నుంచి లేసులు అల్లడం నేర్చుకున్నాను. ఈ కళే నాకు ఉపాధిగా మారింది. పెళ్లయి అత్తారింటికి వచ్చినా అదే వ్యాపకాన్ని కొనసాగిస్తున్నాను. లేసు అల్లికల ద్వారా నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వస్తాయి. వేడి నీళ్లకు చన్నీళ్ల సాయం మాదిరిగా నా కుటుంబానికి ఉపయోగపడుతున్నాయి. మా ప్రాంతంలో లేసు అల్లికలపై దాదాపు 15 వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
– పులపర్తి మహాలక్ష్మి, అధ్యక్షురాలు, నరసాపురం లేసు పార్కు, పశ్చిమగోదావరి జిల్లా

మరిన్ని వార్తలు