కొండపల్లి అటవీ ప్రాంతం.. శాటిలైట్‌ చిత్రాలను మా ముందుంచండి

31 Jul, 2021 03:16 IST|Sakshi

ప్రధాన కాలువను పూడ్చేసిన వాళ్లు అటవీ భూమిని ఆక్రమించలేదంటే నమ్మాలా?

ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాం

ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశం

అధికారులతో సహా స్టోన్‌ క్రషర్ల యజమానులకు నోటీసులు

కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఆదేశం.. విచారణ సెప్టెంబర్‌ 6కు వాయిదా

ప్రధాన కాలువ పూడ్చివేత నిజమేనన్న ప్రభుత్వం

సాక్షి, అమరావతి : కృష్ణాజిల్లా కొండపల్లి అటవీ భూముల ఆక్రమణ, అక్రమ మైనింగ్‌ విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇబ్రహీంపట్నం ప్రధాన కాలువను పూడ్చేసి, ఏకంగా దానిపై నుంచి రోడ్డువేసి, స్టోన్‌ క్రషర్‌ల నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులు.. అటవీ భూములను ఆక్రమించి అక్రమ మైనింగ్‌కు పాల్పడలేదంటే నమ్మాలా? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాలువను ఆక్రమించిన మాట వాస్తవమేనని చెబుతున్న అధికారులు, అటవీ భూమి మాత్రం ఆక్రమణకు గురికాలేదని చెబుతున్న మాటలను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని హైకోర్టు తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకోవాలని భావిస్తున్నామని స్పష్టంచేసింది.

ఇందులో భాగంగా కొండపల్లి అటవీ ప్రాంతం జియో కోఆర్డినేట్స్‌ సాయంతో శాటిలైట్‌ చిత్రాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, కాలుష్య నియంత్రణ మండలికి, అటవీ భూమిలో విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మంది స్టోన్‌ క్రషర్ల యజమానులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఆక్రమణలపై మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి పిల్‌...
కృష్ణాజిల్లా పరిటాల గ్రామ పరిధిలోని ఇబ్రహీంపట్నం ప్రధాన పంట కాలువను అక్రమ మైనింగ్‌దారులు కనుమరుగు చేశారని, ఈ కాలువను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలంటూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. కొండపల్లి రిజర్వ్‌ అటవీ భూములను ధ్వంసం చేస్తూ మైనింగ్‌ చేస్తున్న ఘటనలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కూడా ఆయన తన వ్యాజ్యంలో కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 

కాలువ పూడ్చేసి రోడ్డేసేశారు
ఈ సందర్భంగా పిటిషనర్‌ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది ఎన్‌వీ సుమంత్‌ స్పందిస్తూ.. ఈ కేసులో పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు ప్రభుత్వం గడువు కోరిందని తెలిపారు. ఈ సమయంలో అధికారుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ స్పందిస్తూ, ప్రధాన పంట కాలువను పూడ్చేసిన మాట వాస్తవమేనని.. అక్కడ స్టోన్‌ క్రషర్లను నిర్మించుకుని రోడ్డు కూడా వేసుకున్నారని వివరించారు. 2018లోనే నోటీసులు జారీచేశామని, దీనిపై అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో తెలుసుకుని చెబుతానని సుమన్‌ తెలిపారు. అధికారులు చెబుతున్న దాన్నిబట్టి అటవీ ప్రాంతం ఆక్రమణకు గురికాలేదన్నారు.

మరోసారి ఆక్రమణలను పరిశీలించండి..
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రధాన కాలువనే పూడ్చేసి దానిపై రోడ్డేసి నిర్మాణాలు చేసిన వాళ్లు అటవీ ప్రాంతాన్ని ఆక్రమించలేదంటే నమ్మాలా? అంటూ ప్రశ్నించింది. ఆక్రమణలను మరోమారు పరిశీలించాలని.. జియో కోఆర్డినేట్‌ సాయంతో అటవీ ప్రాంతం శాటిలైట్‌ చిత్రాలను తీసి తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని  ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్‌ 6కి వాయిదా వేసింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు