కొండపల్లిలో దేవినేని ఉమా ఓవరాక్షన్‌..

24 Nov, 2021 16:08 IST|Sakshi

Updates

కొండపల్లిలో చైర్మన్, ఇద్దరి వైస్ చైర్మన్ల ఎన్నిక పూర్తయ్యింది. సీల్డ్ కవర్‌లో ఎన్నిక వివరాలను ప్రిసైడింగ్ అధికారి హైకోర్టుకి నివేదించనున్నారు. ఎన్నికలపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. టీడీపీ ఎంపీ కేశినేని ఓటుపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం తెలిపింది. అన్నీ పరిశీలించి ఫలితాన్ని ప్రకటిస్తామని హైకోర్టు పేర్కొంది.

కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రారంభమైంది. కొండపల్లిలో దేవినేని ఉమా ఓవరాక్షన్‌ చేశారు. ఓటు హక్కులేకపోయినా మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులతో దేవినేని ఉమా వాగ్వాదానికి దిగారు.

సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను బుధవారం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అసిస్టెంట్‌ ఎన్నికల అధికారికి అనుమతినివ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)ను ఆదేశించింది. అయితే ఎన్నిక ఫలితాన్ని మాత్రం వెల్లడించవద్దని న్యాయస్థానం నిర్దేశించింది. ఎక్స్‌ అఫీషియో సభ్యుడి హోదాలో విజయవాడ ఎంపీ వినియోగించుకునే ఓటు ఈ వ్యవహారంలో కోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని పేర్కొంది.

ఎన్నిక ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్‌ చేసి పూర్తి వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. టీడీపీ వార్డు సభ్యులకు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీసు కమిషనర్‌ (ఇన్‌చార్జ్‌) జి.పాలరాజుకు సూచించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ దొనడి రమేశ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎన్నిక నిర్వహణకు ఆదేశాలు ఇవ్వండి...
కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు సంబంధించి తదుపరి ఎలాంటి వాయిదాలకు ఆస్కారం లేకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీ వార్డు సభ్యులు, ఎంపీ కేశినేని నాని, స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కె.శ్రీలక్ష్మి అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ ‘కోరం’ ఉన్నప్పటికీ దురుద్దేశపూర్వకంగా ఎన్నికను వాయిదా వేస్తున్నారని నివేదించారు.

సభ్యులందరికీ ముందస్తు నోటీసు తప్పనిసరి
విచారణ సందర్భంగా కోర్టు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించరా? అంటూ అధికారులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుంటే పోలీసుల సాయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు విజయవాడ ఇన్‌చార్జ్‌ పోలీస్‌ కమిషనర్‌ పాలరాజు, అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి శివనారాయణరెడ్డి మధ్యాహ్నం స్వయంగా కోర్టు ఎదుట హాజరయ్యారు. ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేనందున వాయిదా వేసినట్లు శివనారాయణరెడ్డి తెలిపారు.

సమస్యను స్థానిక పోలీసుల దృష్టికి తెచ్చామన్నారు. ‘ఇలా ఎంత కాలం? రేపు కూడా అడ్డుకుంటే మళ్లీ వాయిదా వేస్తారా? అడ్డుకున్న వారిపై ఏ చర్యలు తీసుకున్నారు?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీ కేశినేని నానికి అనుమతినిస్తూ తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా ఉండేందుకే ఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

‘పోలీసుల సాయంతో ఈరోజు (మంగళవారం) సాయంత్రం 4.30 గంటలకు ఎన్నిక నిర్వహించండి. అడ్డొచ్చిన వారిని అరెస్ట్‌ చేయండి. బుధవారం ఉదయం కల్లా పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి’ అని తొలుత న్యాయమూర్తి మౌఖికంగా స్పష్టం చేశారు. ఈ సమయంలో అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ సభ్యులందరికీ ముందస్తు నోటీసు ఇవ్వడం తప్పనిసరని, ఇందుకు కొంత సమయం పడుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు.

దీంతో బుధవారం ఎన్నిక నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎంపీ కేశినేని నాని వినియోగించుకునే ఓటు హక్కు ఈ వ్యాజ్యాల్లో కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని సుధాకర్‌రెడ్డి పట్టుబట్టడంతో అందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ ఆ విషయాన్ని ఆదేశాల్లో ప్రస్తావించారు. 

ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ
హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం కొండపల్లి మునిసిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 

మరిన్ని వార్తలు