ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోట

27 Sep, 2020 14:03 IST|Sakshi

ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా 'కొండవీడు కోట' అభివృద్ధి

పర్యాటక సదస్సులో రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత

అమీనాబాద్- కొండవీడు రోడ్డు ప్రతిపాదనలకు ఆదేశం

కోట ఆర్చి నిర్మాణం, ప్రవేశ రుసుంపై పరిశీలిస్తామన్న కలెక్టర్

కొండవీడు చరిత్ర వ్యాసాలు గ్రంథావిష్కరణ

సాక్షి, గుంటూరు : రెడ్డిరాజుల పౌరుషం, వైభవానికి ప్రతీకగా ఉన్న 'కొండవీడు కోట'ను ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత హామీనిచ్చారు. స్థిరమైన వారసత్వ సంపదను సంరక్షించేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక రామన్నపేట లోని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో 'కొండవీడు అభివృద్ధి' సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. కొండవీడు హెరిటేజ్ సొసైటీ ఆధ్వర్యాన నిర్వహించిన సదస్సుకు ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత ప్రముఖ నేపథ్యగాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి నిముషం పాటు మౌనంతో సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి సమర్పణలో ప్రముఖ తెలుగు అధ్యాపకులు డాక్టర్ మోదుగుల రవికృష్ణ సంపాదకత్వం చేసిన ' కొండవీడు చరిత్ర వ్యాసాలు' సంకలన గ్రంథాన్ని హోం మంత్రి చేతులమీదుగా ఆవిష్కరించారు.

అనంతరం మంత్రి సుచరిత మాట్లాడుతూ శత్రు సైన్యాన్ని బంధించడానికి బలంగా పెనవేసిన తాడు వంటిది కొండవీటి దుర్గం అని గుర్తుచేశారు. బాల్యంలో తాను స్థానికంగా కొండవీడు కోట కొండలను చూస్తూ పెరిగానని, అప్పట్లో కోట చేరే మార్గం సరిగా ఉండేది కాదని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కొండవీడు అభివృద్ధికి భారీ ప్రణాళికతో విశాల మనసును చాటారని చెప్పారు. కోవిడ్ పరిస్థితులు మారాక కోట అభివృద్ధి కార్యక్రమాలు శరవేగం అవుతాయన్నారు. ఫిరంగిపురం నుంచి కొండవీడు రోడ్డుమార్గం ఇరుకుగా ఉందని కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ శివారెడ్డి తన దృష్టికి తెచ్చారని చెప్పారు. గుంటూరు నుంచి కొండవీడుకు చేరుకునే పర్యాటకులకు ప్రత్యామ్నాయ మార్గంగా అమీనాబాద్ నుంచి కొండవీడుకు రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు చేయాలని సుచరిత ప్రభుత్వాన్ని ఆదేశించారు. వారసత్వ చారిత్రక సంపదగా ఉన్న కొండవీడు సంస్కృతి, సాహితీవైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యమన్నారు.

చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడదల రజని మాట్లాడుతూ.. కోట అవశేషాలు, చరిత్ర నమూనాలతో ప్రపంచ స్థాయిలో పర్యాటకులకు విలువైన విజ్ఞానమందించే ప్రాంతంగా కొండవీడును అభివృద్ధిలోకి తెస్తామన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి స్థాయిలో కొండవీడు అభివృద్ధిపై నిరంతర సమీక్షలకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎ. శామ్యూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కొండపల్లి ఖిల్లా, కొండవీడు కోట రెండూ రెడ్డిరాజుల పాలనలో నిర్మించినవేనన్నారు. పరాక్రమమంటే ఇష్టపడే మహావీరులకు సరైన నివాస స్థానం కొండవీడు అన్నారు. ఓటమిని అంగీకరించిన వారికి సామ్రాజ్యాన్ని తిరిగి అప్పగించే సంప్రదాయం కొండవీటి రెడ్డి రాజుల సొంతమని, ఉత్తమ జాతి అశ్వాలకు, వీరులకు, సంపదలకు, మదపుటేనుగులకు పెట్టింది పేరని, రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని క్రీ.శ.1325 నుంచి క్రీ.శ. 1425 మధ్య రెడ్డి రాజుల పాలన సాగిందన్నారు.శత్రు దుర్భేద్యంగా నిర్మిచిన ఇక్కడి గిరి దుర్గం చారిత్రక సంపదగా వెలురొందిన కొండవీడు ఇక్కడ ఉండటం గుంటూరు జిల్లాకు గర్వకారణమన్నారు.  

రెడ్డి రాజులు తెలుగును అధికార భాషగా చేసి.. శాసననాలను తెలుగులో రాయించారని, వారి ఆస్థానంలో యర్రాప్రగడ కవిగా.. శ్రీనాథుడు విద్యాధికారిగా పని చేసినట్లు చరిత్ర చెబుతున్నట్లు కలెక్టర్ గుర్తుచేశారు. కోట ముఖద్వారం వద్ద ఆర్చి నిర్మాణం చేసి పర్యాటకుల నుంచి ప్రవేశరుసుం వసూలుపై పరిశీలిస్తామన్నారు. తెలుగు అధ్యాపకులు డాక్టర్ మోదుగుల రవికృష్ణ, హెరిటేజ్ సొసైటీ కార్యదర్శి శివారెడ్డి కొండవీడు చరిత్ర ప్రాశస్థ్యం వివరించారు. ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ కొండవీడులో ఇక్కడ యోగి వేమన మండపం ఉండేదని చరిత్ర చెబుతుందని.. 15వ శతాబ్దానికి చెందిన కొండవీటి రాయసం పేరయ్య ‘నవనాథ సిద్ధసారం’ అనే ఆయుర్వేద గ్రంథాన్ని ఇక్కడే రచించి ప్రసిద్ధుడయ్యారని గుర్తుచేశారు.

కొండవీడుకు ఉన్న విశిష్టత మరే ప్రదేశానికి లేదని, ఇది కాలుష్య రహిత ప్రదేశమన్నారు‌. దీనిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిద్దిదాలని కోరారు. జిల్లా ఫారెస్టు రేంజి అధికారి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ కోట పర్యాటక అవశేషాలను రక్షించడంలో తమవంతు బాధ్యతను సమర్ధంగా నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ స్వరాజ్య పోరాటయోధుడు సైరా చిన్నప్పరెడ్డి ముది మనుమడు సుబ్బారెడ్డి తన ముత్తాత చరిత్ర పుస్తకాన్ని హోంమంత్రి, కలెక్టర్ కు అందజేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు