కృష్ణా జలాల హక్కులను కాపాడుకుంటాం

7 Jul, 2021 05:04 IST|Sakshi

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల 

రైల్వేకోడూరు అర్బన్‌: కృష్ణా జలాలపై మన రాష్ట్రానికి ఉన్న హక్కులను కాపాడుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. వైఎస్సార్‌ జిల్లా రైల్వేకోడూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమకు అన్యాయం జరిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం దుందుడుకుగా కృష్ణా జలాలపై అక్రమ ప్రాజెక్టులు కడుతూ కృష్ణా బోర్డు ఆదేశాలు, ఇరు రాష్ట్రాల ఒప్పందాలను బేఖాతరు చేస్తోందన్నారు. కృష్ణా బోర్డు నిష్పక్షపాతంగా తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ నీటి వాడకం వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.

తాగు, సాగు నీటి అవసరాలు లేకున్నా తెలంగాణ ప్రభుత్వం నీరు తోడేస్తుండడం దారుణమన్నారు. శ్రీశైలంలో 850 అడుగుల నీరు ఉంటేనే నెల్లూరు, ప్రకాశం, రాయలసీమకు నీరు ఇవ్వచ్చని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీరు రావాలంటే శ్రీశైలంలో నీరు నిల్వ ఉండాలన్నారు. తెలంగాణలో పులిచింతల, సాగర్‌లలో అవసరం లేకున్నా నీరు వాడుకోవడం వల్ల సీమకు నష్టం జరుగుతోందన్నారు. అక్కడ నిర్మిస్తున్న రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు సహకరించకుండా రాజకీయ పబ్బం కోసం తెలంగాణకు సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా ఇరు రాష్ట్ర ప్రయోజనాలకు సహకరించాలని కోరారు. 

మరిన్ని వార్తలు