‘ప్రభ’వించితివా.. శివా!.. కోటప్పకొండకు శివరాత్రి శోభ

17 Feb, 2023 05:31 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో తిరునాళ్లకు ప్రత్యేకత త్రికోటీశ్వరుడు

వందలాది ఏళ్లుగా ప్రభలతో తరలివస్తున్న భక్తజనం

 కోటిన్నొక్క ప్రభలు కడితే కోటయ్య దిగి వస్తాడని నమ్మకం

సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావు­పేట సమీపంలో ఉండే కోటప్పకొండ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత ఉంది. ఎక్కడాలేని విధంగా శివరాత్రి రోజున కోటప్పకొండకు 30 కి.మీ. దూరంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రభలు కట్టుకుని కొండకు వెళ్లి శివయ్యను దర్శించుకోవడం ఇక్కడి సంస్కృతిలో భాగం. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రభల వైభవాన్ని చూడాలే కాని వర్ణించలేం. ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించింది. తిరునాళ్ల రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు అందజేయడం అనవాయితీ.

ప్రభల సంస్కృతి ప్రారంభమైందిలా
పరమశివుడు మూడు కొండల(త్రికూటం)­పై జంగమదేవర రూపంలో «ధ్యా­నంలో ఉండేవారట. కొండ సమీపంలోని కొండకావూరు గ్రామా­నికి చెంది­న ఆనందవల్లి (గొల్లభామ) నిత్యం స్వా­మికి పాలను తీసు­కెళ్లి ఇచ్చేదట. ఆ తరు­వా­త గర్భం దాల్చిన ఆ­నం­దవల్లి స్వామి చెంతకు వెళ్లి.. తాను కొండ ఎక్కి రాలేకపోతున్నానని చెప్పిందట. కొండదిగి కిందకు వస్తే రోజూలాగే పాలను ఆహారంగా ఇస్తానందట. అందుకు అంగీకరించిన శివుడు.. కొండ దిగుతున్న సమయంలో చివరి వరకు వెనక్కి తిరిగి చూడకూ­డదని షరతు విధించారట.

మధ్యలో వెనుదిరిగి చూస్తే శిల అయిపోతానని చెప్పారట. షరతుకు అంగీకరించి ఆనందవల్లి ముందు నడుస్తుంటే.. స్వామి వెనుకే బయలుదేరారట. కొంతదూరం వెళ్లాక భారీ శబ్దాలు రావటంతో ఆనందవల్లి వెనుదిరిగి చూసిందంట. ఆ వెంటనే స్వామి బ్రహ్మ శిఖరంపై శిల రూపంలో మారిపోయారని చెబుతారు.

ఈ క్షేత్రంలో ఆనందవల్లిని దర్శించుకున్న తర్వాతే స్వామి వారిని దర్శించుకుంటారు. కాగా, అక్కడి భక్తులు స్వామి వద్దకు వెళ్లి కొండ దిగి రావాలని వేడుకోగా.. తన కొండకు ఎప్పుడైతే కోటిన్నొక్క ప్రభలు వస్తాయో అప్పుడే కొండ దిగి వస్తానని చెప్పారట. అప్పటి నుంచి కోటయ్య చెంతకు భక్తులు ప్రభలతో రావడం ప్రారంభమైందని స్థానికులు చెబుతారు.

గ్రామాలు సుభిక్షంగా ఉండాలని..
గ్రామాలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోట­ప్ప­కొండకు ప్రభలు కట్టుకుని వెళతారు. క్రమం తప్ప­కుండా చాలా గ్రామాల ప్రజలు ప్రభలను తీ­సు­కొ­స్తున్నారు. ప్రభల విషయంలో గ్రామాల మధ్య పోటీ కూడా ఉంటుంది. గ్రామ పెద్దలు ఇంటికి ఇంత, ఎకరానికి ఇంత అని చందాలు వేసుకుని ప్రభలు నిర్మిస్తారు. గ్రామాలతోపాటు ప్రత్యేకంగా కొన్ని కుటుంబాలు కూడా ప్రభలు తయారు చేసు­కుం­టా­యి. ఈ ప్రభలపై ఏర్పాటు చేసే కార్య­క్రమా­లను తిలకిస్తూ భక్తు­లు జాగారం పూర్తి చేస్తా­రు.  

ప్రభ కొండకు బయ­లుదేరే ముందు గ్రామంలో, కొండ వద్ద తిరునాళ్ల రోజు, తిరిగి గ్రామానికి వచ్చి­న తర్వాత మరో­సారి పండు­గ వాతావర­ణంలో ప్రభ మ­హో­త్సవాన్ని నిర్వహిస్తారు. గతంలో కోట­ప్ప­కొండకు ఎద్దుల సా­యం­తో ప్రభ­లను తరలించేవారు. ప్రభల ఎత్తు 20 అడు­గుల ఎత్తు వరకు ఉండేది. కాల­క్రమేణా ప్రభల ఎత్తు 80 నుంచి 90 అడుగుల వరకు చేరింది. విద్యుత్‌ ప్రభల త­యా­రీ, కొండకు తరలించడం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాదం, తిరిగి గ్రామానికి చేర్చడా­ని­కి ఒక్కో ప్రభకు రూ.50 లక్షల వరకు ఖర్చవుతోంది.

ప్రభల సంస్కృతిని కాపాడుతున్నాం
తరతరాలుగా మా పూర్వీకులు కోటప్ప­కొండకు ప్రభలు కడుతు­న్నారు. మేం 44 ఏళ్లుగా విద్యుత్‌ ప్రభ కడుతున్నాం. సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 
– ఎన్‌.హరిబాబు, అప్పాపురం, నాదెండ్ల మండలం

గ్రామం బాగు కోరి..
కోటప్పకొండకు ప్రభలను కడితే గ్రామం సుభిక్షంగా ఉంటుందని పెద్దల విశ్వాసం. అదే అనవాయితీని కాపాడు­తూ వస్తున్నాం. శివరాత్రికి రెండు మూడు నెలల ముందే ప్రభల ఏర్పాటుకు సిద్ధమవుతాం. 
– కంచేటి వీరనారాయణ, కాకాని, నరసరావుపేట మండలం 

మరిన్ని వార్తలు