రాష్ట్రంలో కొత్తగా 3,000 ఆలయాలు

25 Feb, 2023 03:59 IST|Sakshi

దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఒక్కొక్కదానికి రూ.10 లక్షల వ్యయం 

ఇప్పటికే పురోగతిలో 936 ఆలయాల నిర్మాణ పనులు  

కొత్తగా 1,568 ఆలయాల నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్టు ఆమోదం 

మరికొన్ని చోట్ల ఆలయాల నిర్మాణానికి ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు 

ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఆధ్వర్యంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలో కొత్తగా దాదాపు 3 వేల ఆలయాలను నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఆలయాల నిర్మాణం కొనసాగుతోందన్నారు. అధికారులతో సమీక్ష అనంతరం శుక్రవారం విజయవాడలో ఆయ­న మీడియాతో మాట్లాడారు. ఒక్కో ఆలయానికి రూ.10 లక్షల చొప్పున 1,072 ఆలయాల నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు.

వీటిలో 936 చోట్ల ఆలయాలను నిర్మించేందుకు భూమిని గుర్తించామని చెప్పారు. వీటిలో పనులు పురోగతిలో ఉన్నాయ­న్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారానే మరో 330 ఆలయాల నిర్మాణం హిందూ ధార్మిక సంస్థ సమరసత ఆధ్వర్యంలో కొనసాగుతోందన్నారు. ఇవికాకుండా మరో 1,568 ఆలయాల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు.

మరో 300 చోట్ల కూడా ఆలయాలను నిర్మించాలని అక్కడి ప్రజాప్రతినిధులు కోరుతున్నారన్నారు. వచ్చే ఏడాదిన్నర కాలంలోనే ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రతి 30 ఆలయాలకు ఒక ఇంజనీరింగ్‌ అధికారిని నియమించనున్నామని తెలిపారు. దేవదాయ శాఖ ఆలయాల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీలకు ఏక విధానంతో కూడిన ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్టు చెప్పారు.  

అన్నదాన సత్రాల ఏర్పాటుకు 18 దరఖాస్తులు.. 
శ్రీశైలంలో వివిధ కులసంఘాల ఆధ్వర్యంలో అన్నదాన సత్రాల ఏర్పాటు, ఇతర సేవా కార్యక్రమాల నిర్వహణకు 18 దరఖాస్తులు ప్రభుత్వ పరిశీలనకు వచ్చాయన్నారు. వీటికి ఒక నిర్ణీత విధానంలో భూకేటాయింపులు చేయాలనే యోచన చేస్తున్నట్టు వివరించారు. ముందుగా అక్కడ భక్తులకు వసతి కోసం ఎన్ని గదులతో సత్రాలు నిర్మిస్తారో పూర్తి ప్లా­న్‌­ను సమర్పించాల్సి ఉంటుందన్నారు.

శ్రీశైలంలో భూముల కేటాయింపు ఆలయ అభివృద్ధికి దోహదపడేలా నిబంధనలు తీసుకొచ్చే యోచనలో ఉన్నా­మని తెలిపారు. శ్రీశైలం ఆలయం– అటవీ శాఖల మధ్య ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 4,700 ఎకరాల భూమిని అటవీ శాఖ.. ఆలయానికి స్వాధీనం చేసేందుకు ఆమోదం తెలిపిందన్నారు.

విజ­యవాడ దుర్గగుడిలో భక్తులకు అదనపు సౌకర్యాల కోసం పూర్తి స్థాయి మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమైందని తెలిపారు. ఆలయాల్లో వివిధ అవసరాలకు వస్తువుల కొనుగోలులో ఎలాంటి అక్రమాలకు తావు­లేకుండా ప్రతి ఆలయంలో మూడు వేర్వేరు టెం­డర్ల ప్రక్రియ ఉంటుందన్నారు. దేవదాయ శాఖ భూముల పరిరక్షణకు ప్రత్యేక సెల్‌ ఉందని తెలిపారు.    

మరిన్ని వార్తలు