‘వీడియోలో మాట్లాడినప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నారు’

1 Aug, 2020 19:29 IST|Sakshi

తాడేపల్లిగూడెం: కరోనా మహమ్మారికి మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత పైడికొండల మాణిక్యాలరావు బలికావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సహృదయుడైన మాణిక్యాలరావు మనల్ని విడిచివెళ్లిపోవడం చాలా బాధను మిగిల్చిందన్నారు. మాణిక్యాలరావు మృతివార్తను తెలుసుకుని ఎంతో కలత చెందానన్నారు.  మాణిక్యాలరావు మృతిపై కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘క్రమశిక్షణ, నిబద్దత గల మాణిక్యాలరావు.. కరోనా వచ్చినపుడు కూడా ఎంతో మనోధైర్యంతో భయపడకుండా వీడియోలో మాట్లాడారు. (మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత)

ఉదయం కూడా వారి అల్లుడి తో ఫోన్ లో మాట్లాడి యోగక్షేమాలు కనుక్కుంటే బాగానే ఉందని చెప్పగా ఎంతో సంతోషపడ్డాం. భారతీయ జనతా పార్టీలో పేరెన్నిన నాయకుడు. ఇలాంటి పరిస్థితుల్లో దూరమవ్వడం చాలా బాధాకరంగా ఉంది. మాణిక్యాలరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అని సంతాపం వ్యక్తం చేశారు. ఎంతోమంది కరోనాను జయించి తిరిగి వస్తున్న సందర్భంలో మాణిక్యాలరావు ఇలా మృతి చెందడం విచారించదగ్గ విషయమన్నారు. కొన్ని రోజుల క్రిత కరోనా వైరస్‌ బారిన పడ్డ పైడి కొండల మాణిక్యాలరావు శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.(‘ఈరోజు ఉదయమే ఆయన కూతురితో మాట్లాడా’)

మరిన్ని వార్తలు