న్యాయబద్ధంగా నీటి కేటాయింపులు

4 Oct, 2020 02:55 IST|Sakshi

అపెక్స్‌ కౌన్సిల్‌లో తెగేసి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వెలువడే వరకు 2015 ఒప్పందం ప్రకారమే కృష్ణా జలాలు పంపిణీ చేయాలి

అదనంగా పంపిణీ చేసిన 197.50 టీఎంసీలను విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకు కేటాయించాలి

ముంపు ముప్పును తప్పించేందుకు వినియోగించుకునే నీటిని లెక్కలోకి తీసుకోకూడదు

2014 జూన్‌ 2 నాటికి పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా గోదావరి జలాల పంపిణీ 

75 శాతం నీటి లభ్యత కంటే అధికంగా ఉన్న గోదావరి జలాలపై పూర్తి హక్కు ఆంధ్రప్రదేశ్‌దే

ఇలాగైతేనే ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన మేరకు నదుల అనుసంధాన పనులు చేపడతామని చెప్పనున్న రాష్ట్రం

వరదలు ఉధృతంగా ఉన్నప్పుడు భారీగా నీరు సముద్రంలో కలుస్తోంది. అలాంటప్పుడు వాడుకునే నీటికి లెక్కలు కట్టడం భావ్యం కాదు. వృథాగా పోతున్న నీటిని ఎవరైనా వాడుకోవచ్చనేదే మా విధానం.
– రాష్ట్ర ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలను రెండు రాష్ట్రాలకు శాస్త్రీయంగా కేటాయించాలని అపెక్స్‌ కౌన్సిల్‌కు స్పష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)–2 తీర్పు వెలువడే వరకు 2015లో జూన్‌ 18, 19న రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే జలాలను పంపిణీ చేయాలని స్పష్టం చేయనుంది. పరీవాహక ప్రాంతం(బేసిన్‌)లో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2014 జూన్‌ 2 నాటికి పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగానే గోదావరి జలాలను (ఆంధ్రప్రదేశ్‌ 776, తెలంగాణ 650 టీఎంసీలు) పంపిణీ చేయాలని తెగేసి చెప్పాలని నిర్ణయించింది. ఈ నెల 6న జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌లో కృష్ణా, గోదావరి నదీ జలాల్లో వాటా విషయంలో తెలంగాణ లేవనెత్తే అభ్యంతరాలను సాక్ష్యాధారాలతో కొట్టిపారేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత కంటే ఎక్కువగా ఉన్న జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఉందని, ఆ నీటిని కేటాయిస్తే ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించిన మేరకు నదుల అనుసంధానం పనులు చేపడతామని స్పష్టం చేసేందుకు సిద్ధమైంది.  

పూటకో మాట.. రోజుకో విధానమా?
► కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణ సర్కార్‌ పూటకో మాట.. రోజుకో విధానం అనుసరిస్తుండటాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌లో ఎండగట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
► కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 811 టీఎంసీల నికర జలాల్లో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్, 299 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకునేందుకు అంగీకరిస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖ అదనపు కార్యదర్శి సమక్షంలో రెండు రాష్ట్రాల అప్పటి జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు ఆదిత్యనాథ్‌ దాస్, ఎస్కే జోషిలు సంతకం చేసిన అంశాన్ని ఎత్తిచూపాలని నిర్ణయించింది.
► కేడబ్ల్యూడీటీ–2 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మిగులు జలాల్లో కేటాయించిన 197.50 టీఎంసీలను విభజన చట్టంలో షెడ్యూలు 11లో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు గుంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు.. తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది.
► శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు పూర్తిగా నిండి.. గేట్లు ఎత్తేసిన సమయంలో.. దిగువ ప్రాంతాలకు ముంపు ముప్పును తగ్గించడానికి రెండు రాష్ట్రాలు మళ్లించే వరద జలాలను లెక్కలోకి తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరనుంది.
► కేడబ్ల్యూడీటీ–1 నాలుగింట మూడొంతుల నీటి లభ్యత (75 శాతం) ఆధారంగా కృష్ణా నదిలో 2,130 టీఎంసీలు ఉంటాయని అంచనా వేసి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. వాటిని కేడబ్ల్యూడీటీ–2 పరిరక్షిస్తూనే.. మూడింట రెండొంతుల (66.66 శాతం) లభ్యత.. 75 శాతం నీటి లభ్యత మధ్య మిగిలిన 448 టీఎంసీల మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలు (పునరుత్పత్తితో 197.50 టీఎంసీలు) కేటాయించింది. ఈ జలాలను విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం అపెక్స్‌ కౌన్సిల్‌ను కోరనుంది. 

విభజన రోజు ఆధారంగా గోదావరి జలాల పంపిణీ 
► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గోదావరి నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 1,360 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని.. పునరుత్పత్తితో కలిపి 1,430 టీఎంసీల లభ్యత ఉంటుందని 2004లో వ్యాప్కోస్‌ నివేదిక ఇచ్చింది.
► 1970–71 నుంచి 2017–18 వరకు పోలవరం వద్ద 3,007 టీఎంసీల మిగులు జలాలు, 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 1,948 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని వ్యాప్కోస్‌ లెక్క కట్టింది. ఎగువ రాష్ట్రాలు తమకు కేటాయించిన వాటా జలాల్లో 1,400 టీఎంసీలను వినియోగించుకోకపోవడం వల్లే ఈ స్థాయిలో మిగులు జలాలు ఉన్నట్లు స్పష్టం చేసింది.
► ఉమ్మడి రాష్ట్రం విడిపోయే నాటికి అంటే 2014 జూన్‌ 2 నాటికి గోదావరి జలాల్లో 660 టీఎంసీలను వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, 472 టీఎంసీలు వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేశాయి. మరో 116 టీఎంసీలను వినియోగించుకునే సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్, 178 టీఎంసీలు ఉపయోగించుకునేలా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని అపెక్స్‌ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు