కడలి వైపు కృష్ణ, పెన్న పరుగులు

29 Sep, 2020 05:39 IST|Sakshi
నెల్లూరులో పరవళ్లు తొక్కుతున్న పెన్నా నది

ప్రకాశం బ్యారేజీ నుంచి 6.46 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు కడలిలోకి

సోమశిల నుంచి 1.08 లక్షల క్యూసెక్కుల పెన్నా జలాలు సముద్రంలోకి

కృష్ణా నదీ గర్భంలోని 32 అక్రమ కట్టడాల యజమానులకు మరోసారి నోటీసులు

సాక్షి, అమరావతి/ అమరావతి బ్యూరో/ శ్రీశైలం ప్రాజెక్ట్‌/ విజయపురిసౌత్‌ (మాచర్ల): పరీవాహక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాల ప్రభావం వల్ల కృష్ణా, పెన్నా నదులు వరద ఉధృతిలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ సముద్రం వైపు పరుగులు తీస్తున్నాయి.
 
► ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని ప్రాజెక్టుల నుంచి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా నదిలోకి భారీగా వరద చేరుతోంది. అయితే, సోమవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి, కుడి గట్టు విద్యుత్కేంద్రం ద్వారా 4,99,672 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 6,03,345 క్యూసెక్కులు చేరుతుండగా.. 20 గేట్ల ద్వారా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు.
► పులిచింతల ప్రాజెక్టు 15 గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 5,77,420 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
► ప్రకాశం బ్యారేజీ గేట్లను పూర్తిగా ఎత్తేసి 6.46 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 
► ప్రకాశం బ్యారేజీలోకి వరద పోటెత్తడంతో నదీ గర్భంలో నిర్మించిన 32 అక్రమ కట్టడాల యజమానులకు జలవనరుల శాఖ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసి అప్రమత్తం చేశారు.
► పెన్నా, ఉప నదులు కుందూ, పాపాఘ్నిల్లో వరద ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. సోమశిల ప్రాజెక్టు నుంచి కండలేరుకు విడుదల చేయగా మిగిలిన 1.08 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోంచి  3.18 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు