నేడు కృష్ణా బోర్డు చైర్మన్‌ పదవీవిరమణ

31 May, 2021 04:21 IST|Sakshi
ఎ.పరమేశం

కొత్త చైర్మన్‌గా ఎంపీ సింగ్‌! 

పీపీఏ సీఈవోగా ఆయనకే అదనపు బాధ్యతలు 

సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎ.పరమేశం సోమవారం పదవీ విరమణ చేయనున్నారు. బోర్డు చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఆర్కే గుప్తాను 2019 మార్చి 31న కేంద్ర జల్‌ శక్తి శాఖ బదిలీ చేసి.. సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్న పరమేశంను 2019 ఏప్రిల్‌ 1న పదోన్నతిపై కృష్ణా బోర్డు చైర్మన్‌గా నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేటకు చెందిన పరమేశం కృష్ణా బోర్డు చైర్మన్‌గా 25 నెలల పాటు పనిచేశారు. పరమేశం పదవీ విరమణ నేపథ్యంలో కృష్ణా బోర్డు కొత్త చైర్మన్‌గా ఎంపీ సింగ్‌ను కేంద్ర జల్‌ శక్తి శాఖ నియమించే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎన్‌టీబీవో (నర్మదా తపతి బేసిన్‌ ఆర్గనైజేషన్‌) సీఈగా పనిచేస్తున్న ఎంపీ సింగ్‌ సర్దార్‌ సరోవర్‌ కన్‌స్ట్రక్షన్‌ అడ్వయిజరీ కమిటీ (ఎస్‌ఎస్‌సీఏసీ) చైర్మన్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

జూన్‌ 1న ఎంపీ సింగ్‌ ఒక్కరికే అదనపు కార్యదర్శిగా పదోన్నతి లభించనుంది. విభజన చట్టం ప్రకారం అనదపు కార్యదర్శి హోదా ఉన్న కేంద్ర జల్‌ శక్తి శాఖ అధికారినే కృష్ణా బోర్డు చైర్మన్‌గా నియమించాలి. ఈ నేపథ్యంలో ఎంపీ సింగ్‌ను కృష్ణా బోర్డు చైర్మన్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నర్మదా నదిపై గుజరాత్‌లో నిర్మించిన సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు పనుల్లో కీలక భూమిక పోషించిన ఎంపీ సింగ్‌కే పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుందని సీడబ్ల్యూసీ వర్గాలు వెల్లడించాయి. 

మరిన్ని వార్తలు