గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై తాడోపేడో

8 Nov, 2021 08:50 IST|Sakshi

12న నాగార్జునసాగర్‌ పరిశీలనకు కృష్ణా బోర్డు కమిటీ

రెండు తెలుగు రాష్ట్రాలకు సమాచారం

అనుమతించే అంశంపై ఎటూ తేల్చని తెలంగాణ

శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల పరిశీలనకు ఇప్పటికే అనుమతించని ఆ రాష్ట్రం 

సాగర్‌ పరిశీలనకు అనుమతించకుంటే కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక ఇవ్వాలని బోర్డు నిర్ణయం

సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ జులై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై తాడోపేడో తేల్చుకోవడానికి బోర్డు సిద్ధమైంది. ఆపరేషనల్‌ ప్రోటోకాల్‌ను రూపొందించేందుకు ఈనెల 12, 13న నాగార్జునసాగర్, దాని నుంచి నేరుగా నీటిని వాడుకునే ఔట్‌లెట్లు (సాగర్‌ స్పిల్‌ వే, ప్రధాన విద్యుత్కేంద్రం, సాగర్‌ ఎడమ కాలువ హెడ్‌ రెగ్యులేటర్, విద్యుత్కేంద్రం, సాగర్‌ కుడి కాలువ హెడ్‌రెగ్యులేటర్, విద్యుత్కేంద్రం, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, సాగర్‌ వరద కాలువ)లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కృష్ణా బోర్డు ఓ కమిటీని పంపుతోంది.

గత నెల 26న కృష్ణా బోర్డు కమిటీని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల పరిశీలనకు తెలంగాణ జెన్‌కో, నీటిపారుదల శాఖ అధికారులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో తన అధీనంలో ఉన్న నాగార్జునసాగర్‌ను పరిశీలించేందుకు బోర్డు కమిటీని తెలంగాణ సర్కార్‌ అనుమతిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. తెలంగాణ అనుమతించకపోతే అదే అంశాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని బోర్డు నిర్ణయించింది. అలాగే, కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసే మార్గదర్శకాల ప్రకారం చర్యలు చేపడతామని బోర్డు వర్గాలు వెల్లడించాయి.

తొలుత అంగీకరించి ఆపై అడ్డంతిరిగి..
ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డు పరిధిలోకి తీసుకుని.. వాటి నుంచి నేరుగా నీటిని వాడుకునే 15 అవుట్‌లెట్లు (ప్రాజెక్టులు)ను నిర్వహించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. బోర్డు సూచనల మేరకు ఏపీలోని హంద్రీ–నీవా (మల్యాల, ముచ్చుమర్రి పంప్‌ హౌస్‌లు), పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, శ్రీశైలం స్పిల్‌ వే, కుడిగట్టు విద్యుత్కేంద్రం, సాగర్‌ కుడి కాలువ విద్యుత్కేంద్రాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తమ సర్కార్‌తో చర్చించి శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం, కల్వకుర్తి పంప్‌ హౌస్, సాగర్‌ స్పిల్‌ వే, ప్రధాన విద్యుత్కేంద్రం, సాగర్‌ ఎడమ కాలువ హెడ్‌ రెగ్యులేటర్, విద్యుత్కేంద్రం, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌; ఏఎమ్మార్పీ, సాగర్‌ వరద కాలువలను బోర్డుకు అప్పగిస్తామని బోర్డు సమావేశంలో తెలంగాణ అధికారులు తెలిపారు. ఆ తర్వాత వారు అడ్డం తిరిగారు.

నిర్వహణ నియమావళిపై అధ్యయనానికి మోకాలడ్డు
శ్రీశైలం, సాగర్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. నిర్వహణ నియమావళి (ఆపరేషనల్‌ ప్రోటోకాల్‌)పై అధ్యయనం చేసి, ముసాయిదా నివేదికను రూపొందించేందుకు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే నేతృత్వంలో కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌ కమిటీని ఏర్పాటుచేశారు. ఈనెల 25, 26న ఈ కమిటీ శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించింది. ఈ పర్యటనకు కమిటీలోని తెలంగాణ సర్కార్‌ తరఫున సభ్యులు గైర్హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతంలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల పరిశీలనకు కమిటీని తెలంగాణ సర్కార్‌ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కార్‌ అధీనంలోని సాగర్‌ పరిశీలనకు కమిటీ 12, 13న పర్యటిస్తుందని ఇప్పటికే ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, సీఈ మురళీధర్‌లకు బోర్డు సమాచారం ఇచ్చింది. దీనిపై ఇప్పటిదాకా తెలంగాణ అధికారులు స్పందించలేదు.

మరిన్ని వార్తలు