బోర్డు ఆదేశాలంటే లెక్కలేదా?

4 Aug, 2020 05:48 IST|Sakshi

దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీరూ దక్కనివ్వరా? 

శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని తక్షణమే ఆపండి

తెలంగాణ సర్కారుపై కృష్ణా బోర్డు ఆగ్రహం

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌: శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్‌కో యథేచ్చగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తుండటంపై కృష్ణా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, ఫ్లోరైడ్‌ ప్రభావిత గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీటిని దక్కనివ్వరా? అని ప్రశ్నించింది. శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో తక్షణమే విద్యుదుత్పత్తి నిలిపివేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్‌ మీనా సోమవారం లేఖ రాశారు. ముఖ్యాంశాలివీ..

► శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల కంటే ఎక్కువస్థాయిలో ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాలి. జూలై 19 నాటికి నీటిమట్టం ఆ మేరకు లేకున్నా తెలంగాణ జెన్‌కో ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. దిగువకు నీటిని విడుదల చేయడం వల్ల శ్రీశైలం నీటిమట్టం తగ్గిపోతూ వచ్చింది. దీనివల్ల రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులకు కనీసం తాగునీటి అవసరాలకు కూడా జలాలను తరలించలేని దుస్థితి నెలకొందని, తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని అదేరోజు ఏపీ ప్రభుత్వం మాకు లేఖ రాసింది. 
► తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపాలని ఆదేశిస్తూ మేం లేఖ రాసినా తెలంగాణ జెన్‌కో ఆ ఉత్తర్వులను తుంగలో తొక్కి విద్యుదుత్పత్తి చేస్తూ యథేచ్ఛగా దిగువకు నీటిని తరలిస్తోంది. జూలై 21 నుంచి 30 వరకూ శ్రీశైలంలోకి 54.98 టీఎంసీల ప్రవాహం వస్తే ఎడమగట్టు కేంద్రం ద్వారా 32.27 టీఎంసీలను దిగువకు విడుదల చేసింది. శ్రీశైలంలో నీటిమట్టం తగ్గిపోవడం వల్ల తాగునీటి అవసరాలకు నీటిని తరలించలేకపోతున్నామని జూలై 30న ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి మరోసారి మాకు లేఖ రాశారు. జూలై 20న జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ జెన్‌కో తుంగలో తొక్కి ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయడంలో ఆంతర్యమేంటి? బోర్డు ఆదేశాలంటే లెక్క లేదా?

యథేచ్ఛగా విద్యుదుత్పత్తి
► కృష్ణా బోర్డు ఆదేశాలను యథేచ్ఛగా బేఖాతరు చేస్తూ తెలంగాణ జెన్‌కో సోమవారం కూడా శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలోని ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 43,947 క్యూసెక్కులను విడుదల చేస్తోంది. శ్రీశైలం జలాశయంలోకి 24,698 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. అంతకంటే ఎక్కువ పరిమాణంలో దిగువకు విడుదల చేస్తుండటం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టం 851.1 అడుగులకు పడిపోయింది. నీటి నిల్వ 82.58 టీఎంసీలకు తగ్గింది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం నుంచి వదిలిన నీరు చేరుతుండటంతో నాగార్జునసాగర్‌లో నీటి మట్టం 551.6 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ 213.32 టీఎంసీలకు పెరిగింది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు