ఆంధ్రప్రదేశ్‌కు 13.5 టీఎంసీలు

1 Jul, 2022 03:42 IST|Sakshi

తెలంగాణకు 15.65 టీఎంసీలు

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం

నెలాఖరులో మరోసారి కమిటీ భేటీ

సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్‌లో కనీస నీటి మట్టానికి ఎగువన లభ్యతగా ఉన్న నీటిలో ఏపీకి 13.5 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. తెలంగాణకు 13.25 టీఎంసీలు, శ్రీశైలంలో కల్వకుర్తి ఎత్తిపోతలకు 2.4 టీఎంసీలను.. మొత్తం 15.65 టీఎంసీలను కేటాయించింది. త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తెలిపారు. రాయ్‌పురే కన్వీనర్‌గా ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్‌ సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ గురువారం వర్చువల్‌ విధానంలో సమావేశమైంది.

గతేడాది తమ కోటాలోని 47.719 టీఎంసీలను శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు తరలించామని, వాటిని ఈ ఏడాది వాడుకొంటామని తెలంగాణ ఈఎన్‌సీ కోరారు. దీనిపై ఏపీ ఈఎన్‌సీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఏ నీటి సంవత్సరం లెక్కలు అదే ఏడాదితో ముగుస్తాయని,  కోటాలో మిగిలిన నీటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలని బచావత్‌ ట్రిబ్యునల్‌ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కూడా బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పునే సమర్ధించిందని, క్యారీ ఓవర్‌ జలాల్లో ఏపీకి 66, తెలంగాణకు 34 శాతం వాటా ఉంటుందని నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో క్యారీ ఓవర్‌ జలాల్లో సాగర్‌ కుడి కాలువకు 10, ఎడమ కాలువకు 3.5 టీఎంసీలు కేటాయించాలని ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి చేసిన ప్రతిపాదనను రాయ్‌పురే అంగీకరించారు. సాగర్‌లో తాగునీటి అవసరాలకు 5.75 టీఎంసీలు, ఎడమ కాలువకు 7.5 టీఎంసీలు, శ్రీశైలంలో కల్వకుర్తి ఎత్తిపోతలకు 2.4 టీఎంసీలను విడుదల చేయాలన్న తెలంగాణ ఈఎన్‌సీ ప్రతిపాదనకు రాయ్‌పురే అంగీకరించారు. శ్రీశైలంలో జూన్‌ 1 నుంచి గురువారం వరకు ఏపీ 10.884 టీఎంసీలు, తెలంగాణ 3.504 టీఎంసీలు వాడుకున్నట్లు లెక్క చెప్పారు. జూలై ఆఖరులో మరోసారి కమిటీ సమావేశమై.. అప్పటి నీటి లభ్యత ఆధారంగా కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. 

ఈసారైనా తెలంగాణ అధికారులు వస్తారా? 
కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) మూడో సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో జరగనుంది. తొలి రెండు సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు హాజరుకాలేదు. వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన మూడో సమావేశానికైనా వస్తారా.. రారా.. అన్నది చర్చనీయాంశంగా మారింది. మే 6న జరిగిన కృష్ణా బోర్డు  సమావేశంలో ఆర్‌ఎంసీ ఏర్పాటైంది.

ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో విద్యుదుత్పత్తికి నిబంధనలు, ఆయకట్టుకు నీటి విడుదల (రూల్‌ కర్వ్‌) నియమావళి, వరద రోజుల్లో మళ్లించిన నీటిని కోటాలో కలపాలా? వద్దా? అనే అంశాలపై చర్చించి, నివేదిక ఇచ్చేందకు కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై, ముయాన్‌తంగ్, ఏపీ, తెలంగాణల ఈఎన్‌సీలు, జెన్‌కో డైరెక్టర్లు సభ్యులుగా ఆర్‌ఎంసీని ఏర్పాటు చేశారు. జలవిద్యుదుత్పత్తి నియమావళి నివేదికను 15 రోజుల్లోగా, మిగతా రెండు అంశాలపై నెలలోగా నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. ఇందుకోసం మే 20న, 30న జరిగిన  తొలి రెండు సమావేశాలకు తెలంగాణ అధికారులు రాకపోవడంతో ఆర్‌ఎంసీ మూడో భేటీని ఏర్పాటు చేసింది.   

మరిన్ని వార్తలు