వాటాలో వినియోగించుకోని నీటిపై తేల్చండి

15 Aug, 2020 06:30 IST|Sakshi

కేంద్రానికి కృష్ణా బోర్డు లేఖ

గతేడాది వినియోగించుకోని నీటిని విడుదల చేయాలన్న తెలంగాణ

ఎప్పటి నీటిలెక్కలు అప్పటితోనే ముగుస్తాయన్న ఆంధ్రప్రదేశ్‌ 

వాటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలని ఏపీ ప్రభుత్వం స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల్లో గతేడాది వాటా నీటిలో వినియోగించుకోకుండా మిగిలిన వాటిని తర్వాతి సంవత్సరం ఉపయోగించుకోవచ్చా? లేదా? అనే అంశంపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కృష్ణా బోర్డు కోరింది. గతేడాది వినియోగించుకోని వాటా నీటిని ఈ ఏడాది విడుదల చేయాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్‌ చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఏ నీటి సంవత్సరం నీటి లెక్కలు అదే ఏడాదితో ముగుస్తాయని.. వినియోగించుకోని నీటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలని తేల్చిచెప్పింది. ఈ నీటి వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్ర జలసంఘానికి పంపించి, వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం సూచించాలని విజ్ఞప్తి చేస్తూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్‌ మీనా శుక్రవారం కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలు ఇవీ..

► 2019–20 నీటి ఏడాదిలో ఏపీ 651.99 టీఎంసీలకు గానూ 647.43 టీఎంసీలు వినియోగించుకుంది. తెలంగాణ 333.52 టీఎంసీల వాటాకు278.33 టీఎంసీలు ఉపయోగించుకుంది.
► గత నీటి సంవత్సరంలో వాటాలో 50 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకోలేదని, ఆ నీటిని 2020–21లో ఉపయోగించుకుంటామని తెలంగాణ ప్రతిపాదించింది. 
► కానీ, దానిని ఏపీ తోసిపుచ్చింది. ఏ నీటి సంవత్సరం లెక్కలు అక్కడితోనే ముగుస్తాయని.. వాటిని క్యారీ ఓవర్‌గా పరిగణించాలని స్పష్టంచేసింది.
► దీంతో ఈ వివాదంపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకువచ్చాం. ఈ కమిటీ భేటీలోనూ రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ అంశంపై విధివిధానాలు ఖరారుచేసే బాధ్యతను కేంద్ర జలసంఘానికి అప్పగించి వీలైనంత తొందరగా తేల్చాలి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా