‘మిగులు’ మళ్లింపుపై మీ వైఖరేంటి?

25 Aug, 2020 05:50 IST|Sakshi

తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ 

వరద ముప్పు నివారణకే మళ్లిస్తున్నట్లు ఏపీ స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి: కృష్ణా బేసిన్‌(పరీవాహక ప్రాంతం)లో దిగువ ప్రాంతాలకు వరద ముప్పు తప్పించేందుకే నీటిని మళ్లిస్తున్నామని, వాటిని లెక్కలోకి తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై వైఖరి వెల్లడించాలని తెలంగాణను కృష్ణా బోర్డు కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌కు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఎల్బీమౌన్‌తంగ్‌ సోమవారం లేఖ రాశారు.  

► జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీలు నిండినందున లక్షలాది క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నామని, ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి ఐదు లక్షల క్యూసెక్కుల వరద వస్తుందన్న అంచనాల నేపథ్యంలో విజయవాడ, పరిసర ప్రాంతాలను ముంపు బారిన పడకుండా కాపాడేందుకు నీటిని మళ్లిస్తున్నామని, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఈనెల 22న కృష్ణా బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇలా మళ్లిస్తున్న నీటిని మిగులు జలాలుగా పరిగణించి విభజన చట్టం 11వ షెడ్యూలులోని ఆరు పేరా నుంచి వాటిని మినహాయించాలని కోరారు.  

సముద్రంలో వృథాగా కలిసే మిగులు జలాలనే మళ్లిస్తున్నందున వాటిని ఆ ప్రకారమే పరిగణించి లెక్కలోకి తీసుకోవద్దని  కోరారు.  వరదల సమయంలో ఏ రాష్ట్రం నీటిని మళ్లించినా వాటిని ఆ రాష్ట్రం కోటా కింద పరిగణించకూడదని విజ్ఞప్తి చేశారు. 

శ్రీశైలం ప్రమాదంపై నివేదిక ఇవ్వండి 
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో జరిగిన దుర్ఘటనపై కృష్ణా బోర్డు విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో పలువురు ఉద్యోగులు మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాల్సినందున త్వరగా నివేదిక పంపించాలని సూచించింది. 

మరిన్ని వార్తలు