Krishna Water Dispute: జల జగడంపై కదిలిన కృష్ణా బోర్డు

3 Jul, 2021 03:46 IST|Sakshi

9న త్రిసభ్య కమిటీ భేటీ

సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించేందుకు కృష్ణా బోర్డు కదిలింది. ఎలాంటి అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్‌.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేయడంపై చర్చించేందుకు ఈ నెల 9న త్రిసభ్య కమిటీ భేటీని ఏర్పాటు చేస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే శుక్రవారం లేఖ రాశారు.

శ్రీశైలం కనీస నీటిమట్టం స్థాయికి నీటి నిల్వ దాటకుండానే.. తెలంగాణ సర్కార్‌ ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేస్తుండటంపై గత నెల 10న, 23న కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. వాటిపై స్పందించిన కృష్ణా బోర్డు తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. కానీ.. ఆ ఆదేశాలను తెలంగాణ బేఖాతరు చేస్తూ విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. దీనిపై గత నెల 29న మరోసారి కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.

కృష్ణా డెల్టా ఎస్‌ఈ నీటిని విడుదల చేయాలని ఎలాంటి ప్రతిపాదనలు పంపకున్నప్పటికీ.. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా పులిచింతల ప్రాజెక్టులోనూ తెలంగాణ సర్కార్‌ విద్యుదుత్పత్తిని ప్రారంభించడంపై గత నెల 30న బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. మూడు ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టులను ఖాళీ చేయడం వల్ల తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని.. వాటిని పరిరక్షించాలని కృష్ణా బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై చర్చించేందుకు 9న త్రిసభ్య కమిటీ భేటీని ఏర్పాటు చేసినట్లు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తెలిపారు.   

మరిన్ని వార్తలు