నీటి లెక్కలు చెప్పండి

12 Aug, 2020 05:17 IST|Sakshi

రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఆదేశం

సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలోకి వస్తున్న ప్రవాహాలు, వినియోగిస్తున్న నీటి వివరాలను అందజేసినట్లే ఉపనదుల్లోని నీటి లెక్కలను ఎప్పటికప్పుడు తెలపాలని రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఈఎన్‌సీలను కృష్ణా బోర్డు ఆదేశించింది. తద్వారా నీటి కేటాయింపులు, వినియోగం లెక్కలు పారదర్శకంగా ఉంటాయని తెలిపింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్‌ మీనా మంగళవారం ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలకు లేఖ రాశారు.

► భైరవవానితిప్ప ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ (గోదావరి నుంచి మళ్లించిన నీటి వివరాలు), తెలుగుగంగ ప్రాజెక్టు (టీజీపీ), తుంగభద్ర హెచ్చెల్సీ.. ఎల్లెల్సీ, గాజులదిన్నె ప్రాజెక్టు, మున్నేరు ప్రాజెక్టుల నుంచి వినియోగిస్తున్న నీటి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఏపీ ఈఎన్‌సీని బోర్డు కోరింది.
► ఆర్డీఎస్‌ (రాజోలిబండ డైవర్షన్‌ స్కీం), ఓకచెట్టివాగు ప్రాజెక్టు, కోటిపల్లివాగు ప్రాజెక్టు, డిండి, మూసీ, పాలేరు ప్రాజెక్టులలోకి వస్తున్న ప్రవాహాలు, నీటి వినియోగం లెక్కలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలంగాణ ఈఎన్‌సీ కోరింది.
► నీటి వినియోగం లెక్కలను ఎప్పటికప్పుడు తెలపడం వల్ల ఇరు రాష్ట్రాల వాటాల మేరకు నీటిని కేటాయిస్తామని, ఇది పారదర్శకంగా ఉంటుందని పేర్కొంది.  

మరిన్ని వార్తలు