17న కృష్ణా బోర్డు ఆర్‌ఎంసీ భేటీ

24 Sep, 2022 08:49 IST|Sakshi

శ్రీశైలం, సాగర్‌ నిర్వహణ నియమావళి ముసాయిదా ఖరారే అజెండా

సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచూ వివాదానికి కారణమవుతోన్న అంశాలను పరిష్కరించడానికి విధివిధానాలను రూపొందించేందుకు కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌ ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ) అక్టోబర్‌ 17న సమావేశం కానుంది. హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏ ప్రాజెక్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే అంశంపై నియమావళి (రూల్‌ కర్వ్‌), విద్యుత్‌ ఉత్పత్తి, వరద జలాల మళ్లింపుపై విధివిధానాలను రూపొందించి ముసాయిదా నివేదిక ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఆర్‌ఎంసీ ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైంది.

ముసాయిదా నివేదికను ఖరారు చేసేందుకు ఆగస్టు 23న సమావేశం కావాలని ఆర్‌ఎంసీ చైర్మన్‌ ఆర్కే పిళ్‌లై తొలుత నిర్ణయించారు. కానీ, ఆ సమావేశం వాయిదా వేయాలని రెండు రాష్ట్రాలు కోరడంతో ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా వేశారు. తాజాగా ఈ నెల 27న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ సర్కార్‌ మళ్లీ వాయిదా వేయాలని కోరింది. దీంతో అక్టోబర్‌ 17వ తేదీకి సమావేశాన్ని వాయిదా వేసింది. ఈ సమావేశంలో ముసాయిదా నివేదికను ఖరారు చేసి కృష్ణా బోర్డుకు పంపనుంది. బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఆ నివేదిక మేరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లను బోర్డు నిర్వహించనుంది.

మరిన్ని వార్తలు