24న కృష్ణా బోర్డు ఆర్‌ఎంసీ భేటీ

18 Nov, 2022 05:10 IST|Sakshi

ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి రూపకల్పనే అజెండా

సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు రిజర్వాయర్స్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఆర్‌ఎంసీ) సమావేశం ఈ నెల 24న హైదరాబాద్‌లో జరగనుంది. కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నిర్వహణ నియమావళిని రూపొందించడమే అజెండాగా ఈ సమావేశం ఉంటుంది. ఇప్పటికే ఆర్‌ఎంసీ నాలుగుసార్లు సమావేశమై శ్రీశైలం, సాగర్‌ నిర్వహణపై సమగ్రంగా చర్చించింది.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల కింద ఏ కాలువకు ఎప్పుడు నీరు విడుదల చేయాలి, విద్యుత్‌ ఉత్పత్తిని ఎలా చేయాలి, మళ్లించిన వరద జలాలను లెక్కలోకి తీసుకోవాలా... వద్దా... అనే అంశాలపై ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదాను 24న జరిగే భేటీలో చర్చించి, ఆమోదించనుంది. ఆ తర్వాత కృష్ణా బోర్డుకు ముసాయిదా నివేదిక సమర్పించనుంది.

కృష్ణా బోర్డు సర్వసభ్య సమావేశంలో ఈ ముసాయిదాను చర్చించి, రెండు రాష్ట్రాల అభిప్రాయాల మేరకు దానిలో మార్పులు, చేర్పులు చేసి నిర్వహణ నియమావళిని ఖరారు చేస్తారు. ఈ నియమావళి ఆధారంగా ఉమ్మడి ప్రాజెక్టులను నిర్వహించడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు చరమగీతం పాడాలనేది బోర్డు లక్ష్యం.   

మరిన్ని వార్తలు