శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణపై కృష్ణా బోర్డు అధ్యయనం

26 Oct, 2021 05:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం ప్రాజెక్టును తన పరిధిలోకి తీసుకోవాలని నిర్ణయించిన కృష్ణా బోర్డు ఆ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన వర్కింగ్‌ ప్రోటోకాల్‌ను ఖరారు చేయడంపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే నేతృత్వంలో సీఈలు రవికుమార్‌ పిళ్లై, శివరాజన్‌లతో కూడిన సమన్వయ కమిటీ సోమవారం కర్నూలు జిల్లాలోని హంద్రీ–నీవా (మల్యాల పంప్‌హౌస్‌), ముచ్చుమర్రి ఎత్తిపోతలను పరిశీలించింది. ఆ తర్వాత తెలుగు గంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టుకు నీటిని విడుదల చేసే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను పరిశీలించింది.

అక్కడి నుంచి ఎస్సార్బీసీ కాలువ మీదుగా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు చేరుకుంది. అక్కడి నుంచి వెనక్కి వచ్చే సమయంలో ఎస్సార్బీసీ 12వ కి.మీ. వద్ద ఏర్పాటు చేసిన టెలీమెట్రీ మీటర్లను పరిశీలించింది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి మూడు ప్రాజెక్టుల ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఎస్సార్బీసీ ఏర్పాటు చేసిన టెలీమీటర్‌ ద్వారా ప్రతి చుక్క నీటిని లెక్కించవచ్చని కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్‌ సీఈ మురళీనాథ్‌రెడ్డి సమన్వయ కమిటీకి వివరించారు. బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ను బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ఆ తర్వాత సమన్వయ కమిటీ శ్రీశైలానికి బయలుదేరింది. సమన్వయ కమిటీ వెంట ఏపీ అంతర్‌ రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ కేఏ శ్రీనివాసరెడ్డి ఉన్నారు.  

మరిన్ని వార్తలు