కృష్ణా బోర్డే సుప్రీం

28 Dec, 2020 09:27 IST|Sakshi

నీటి వివాదాలకు చెక్‌ పెట్టే దిశగా కేంద్రం కసరత్తు

జనవరి మొదటి వారంలో కృష్ణా బోర్డు పరిధి ఖరారు!

ఇప్పటికే ముసాయిదాపై ఆమోద ముద్ర వేసిన కేంద్ర జల్‌ శక్తి శాఖ

మంత్రి షెకావత్‌ ఆమోదించడం ఇక లాంఛనమే

సాక్షి, అమరావతి: నీటి పంపిణీ వివాదాలకు తెర దించేలా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని ఖరారు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. బోర్డు పరిధిపై కృష్ణా బోర్డు పంపిన ముసాయిదాపై కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ చైర్మన్, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఈ ముసాయిదాను ఆమోదించడం ఇక లాంఛనమే. జనవరి మొదటి వారంలో కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్‌ 85(1) ప్రకారం కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. కానీ.. పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్‌ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడం వల్ల బోర్డుకు ఎలాంటి అధికారాలు లేవు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నాయి. కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు సరపడా ఉన్నా.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ యథేచ్ఛగా తెలంగాణ సర్కార్‌ నీటిని తరలిస్తుండటమే అందుకు నిదర్శనం.

ఎన్నాళ్లకెన్నాళ్లకు..
శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడంతో బోర్డు కేటాయింపులు ఉన్నా సరే రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంటోంది. అక్టోబర్‌ 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో భేటీలో ఇదే అంశాన్ని ఎత్తిచూపిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కోరారు. 
 కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల పరిష్కార న్యాయస్థానం) –2 తీర్పును నోటిఫై చేసే వరకు బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వాదనను కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి తోసిపుచ్చారు. అపెక్స్‌ కౌన్సిల్‌కు ఉన్న విచక్షణాధికారాలతో బోర్డు పరిధిని నోటిఫై చేస్తామని స్పష్టం చేశారు. 
♦ కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వెలువడే వరకు 2015లో కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటు మేరకు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున నీటి కేటాయింపులు చేస్తామని తేలి్చచెప్పారు. (కేంద్రం కోర్టులోకి ‘నియంత్రణ’)

కృష్ణా బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు  

తుంగభద్ర నదిపై..  

ఆంధ్రప్రదేశ్‌  తెలంగాణ
హెచ్చెల్సీ తుమ్మిళ్ల ఎత్తిపోతల
ఎల్లెల్సీ -
కేసీ కెనాల్‌ ఆర్డీఎస్‌ 

కృష్ణా నదిపై..  జూరాల ప్రాజెక్టు: 
తెలంగాణ 
1.జూరాల ప్రాజెక్టు, జలవిద్యుత్కేంద్రం 
2.జూరాల కుడి కాలువ, ఎడమ కాలువ 
3.భీమా ఎత్తిపోతల 
4.నెట్టెంపాడు ఎత్తిపోతల 
5.కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల

శ్రీశైలం ప్రాజెక్టు: 

ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ
1.పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, (తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి)   1.కల్వకుర్తి ఎత్తిపోతల 
2.కుడి విద్యుత్కేంద్రం 2.ఎడమ విద్యుత్కేంద్రం
3.హంద్రీ–నీవా (మల్యాల) 3.పాలమూరు–రంగారెడ్డి, డిండి
4.హంద్రీ–నీవా (ముచ్చుమర్రి) 4.ఎస్సెల్బీసీ
5.వెలిగొండ  -

నాగార్జునసాగర్‌: 

ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ
1.సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌  1.సాగర్‌ ఎడమ కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌
2.జలవిద్యుత్కేంద్రం
3.ఏఎమ్మార్పీ
4.ఎఫ్‌ఎఫ్‌సీ
5.హైదరాబాద్‌ తాగునీటి పథకం

పులిచింతల ప్రాజెక్టు: 

ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ
1.పులిచింతల ప్రాజెక్టు స్పిల్‌ వే 1.జలవిద్యుత్కేంద్రం

ప్రకాశం బ్యారేజీ 
1.కృష్ణా డెల్టా కాలువలు     

చిన్న నీటి వనరుల విభాగం: 

ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ
1.భైరవానితిప్ప ప్రాజెక్టు 1.సీతారామభక్త ఎత్తిపోతల
2.గాజులదిన్నె ప్రాజెక్టు  2.డిండి ప్రాజెక్టు
3.మూసీ ప్రాజెక్టు
4.పాలేరు ప్రాజెక్టు.. తదితర చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు

జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు..
కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి షెకావత్‌ ఆదేశాల మేరకు ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్‌ 23న బోర్డు పరిధిపై ముసాయిదాను కృష్ణా బోర్డు చైర్మన్‌ పరమేశం కేంద్రానికి పంపారు. దిగువ కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తోపాటు జూరాల, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలను బోర్డు పరిధిలోకి తేవాలని ప్రతిపాదించారు.  
ఈ ప్రాజెక్టుల స్పిల్‌ వే లతోపాటు జల విద్యుదుత్పత్తి కేంద్రాలు, నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు బోర్డు పరిధిలోకి తేవాలని చెప్పారు. ఇరు రాష్ట్రాల్లో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులైన భైరవానితిప్ప, గాజులదిన్నె, డిండి, మూసీ, పాలేరు ప్రాజెక్టులు, సీతారామభక్త ఎత్తిపోతల పథకాన్ని బోర్డు పరిధిలోకి తేవాలని 
ప్రతిపాదించారు. ఈ ముసాయిదాపై ఇప్పటికే కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ఆమోద ముద్ర వేశారు. ఇక ఆ శాఖ  మంత్రి ఆమోద ముద్ర వేయగానే బోర్డు పరిధిని కేంద్రం నోటిఫై చేయనుంది.  
ఈ ప్రాజెక్టుల వద్ద పనిచేసే ఇరు రాష్ట్రాల అధికారులు బోర్డు పరిధిలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నీటి లభ్యతను బట్టి.. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమై వివాదాలకు తావు లేకుండా ఇరు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తుంది.  ()

మరిన్ని వార్తలు