రైతుల మేలుకోరి.. ముందడుగు

18 Jul, 2022 17:06 IST|Sakshi
మైలవరంలోని చంద్రగూడెం వద్ద వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ మీటర్‌

మైలవరం మండలంలోని గణపవరంలో ప్రయోగాత్మకంగా మీటర్ల బిగింపు పూర్తి

మిగిలిన మండలాల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో 1.08 లక్షల వ్యవసాయ కనెక్షన్లు

నగదు బదిలీ కోసం రైతుల బ్యాంకు ఖాతాల సేకరణ

ఈ ప్రక్రియపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్న విద్యుత్‌ సిబ్బంది

సాక్షి ప్రతినిధి, విజయవాడ: వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు వీలుగా విద్యుత్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి, వారిలో ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేశారు. ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం గణపవరం గ్రామాన్ని ఎంచుకొని, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను బిగించి పరిశీలించారు. బెంగళూరులోని ప్రయోగశాల నుంచి వీటిని పరీక్షించారు. 

సానుకూల ఫలితాలు రావడంతో ఉమ్మడి జిల్లాలోని 1,08,859 వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు వీలుగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి గానూ అర్హత పొందిన ఏజెన్సీలు మీటర్లను దశల వారీగా సరఫరా చేయనున్నాయి. సంబంధిత ఏజెన్సీ బిల్లులు తయారు చేసి డిస్కంలకు అందజేయనున్నాయి. వీటి ఆధారంగా ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ప్రస్తుతం నగదు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. దీంతో పాటు రైతుల నుంచి డెబిట్‌ మ్యాన్‌డేట్‌ ఫారాలను సేకరిస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వం జమ చేసే బిల్లు మొత్తం సంబంధిత డిస్కంకు బదిలీ అయ్యేందుకు ఆమోదం తెలిపినట్లవుతుంది.  


బ్యాంకు ఖాతాల సేకరణ ఇలా.. 

విజయవాడ సర్కిల్‌ పరిధిలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 1,08,859 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటీకి సంబంధించి డిస్కంల వద్ద ఉన్న రికార్డుల వివరాలను పోల్చుకొని, అప్‌డేట్‌ చేస్తున్నారు. అప్‌డేట్‌ కాని చోట్ల రికార్డుల్లో మార్పులు చేస్తున్నారు. పాస్‌ పుస్తకం, భూ యజమాన్య హక్కు పత్రం ఆధారంగా కనెక్షన్లను, ప్రస్తుతం ఉన్న హక్కుదారుడి పేరిట నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి డిస్కంల వద్ద 55,610 ఖాతాలుండగా, తాజాగా మరో 11,415 ఖాతాలను రైతుల ద్వారా ఓపెన్‌ చేయించారు. మిగిలిన 41,834 వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి, రైతులతో ఖాతాలు తెరిచే పనిలో విద్యుత్‌ సిబ్బంది నిమగ్నం అయ్యింది. ప్రధానంగా వ్యవసాయ కనెక్షన్లు అధికంగా ఉన్న నూజివీడు, విజయవాడ రూరల్, ఉయ్యూరు డివిజన్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

అపోహలను తొలగిస్తున్నాం
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను బిగించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ విధానంపై రైతుల్లో నెలకొన్న అపొహలను తొలగిస్తున్నాం. వారి ఖాతాల్లో బిల్లుకు సంబంధించిన నగదును జమ చేసేందుకు వీలుగా బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నాం. రైతుల నుంచి డెబిట్‌  మ్యాన్‌డేట్‌ ఫారాలను సేకరిస్తున్నాం. 
– శివప్రసాద్‌రెడ్డి, ఎస్‌ఈ, విజయవాడ సర్కిల్‌  

మరిన్ని వార్తలు