కృష్ణా పోలీసుల పెద్ద మనసు

4 Sep, 2020 08:26 IST|Sakshi

దళిత యువతికి పోలీసుల ఆర్థిక సాయం

ప్రేమించి వంచించిన యువకుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు 

సాక్షి, కృష్ణా/కైకలూరు: దళితులపై దాడులకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించవద్దన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా తమ సేవాగుణాన్ని కూడా చాటుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ఒక దళిత యువతి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అయినంపూడి గ్రామానికి చెందిన దళిత యువతి (22) అదే మండలం వడాలికి చెందిన మంద సాయిరెడ్డి(24) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు.

అయితే యువతిని వివాహం చేసుకునేందుకు సాయిరెడ్డి నిరాకరించడంతో ఆమె ముదినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు సాయిరెడ్డిని రిమాండ్‌కు తరలించారు. యువతిని కొంతమంది బెదిరించడంతో మరో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు యువతి ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
(చదవండి: నెల్లూరులో బాలుడి కిడ్నాప్ కలకలం)

పోలీసుల సేవా గుణం
ఇంటి దగ్ధం విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో గుడివాడ డీఎస్పీ ఎన్‌. సత్యానందం సిబ్బందితో గురువారం బాధితుల వద్దకు వెళ్లి రూ.25 వేలు నగదు, మరో రూ.25వేలు విలువ చేసే నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు అందించారు. ఇంటి నిర్మాణానికి పోలీసుల తరఫున పూర్తి సాయం అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇల్లు దగ్ధం కేసులో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ముఖ్యంగా అర్ధరాత్రి ఇల్లు దగ్ధమవుతున్న సమయంలో ఎస్‌ఐ మణికుమార్‌ తన సిబ్బందితో కలిసి మంటలు అదుపు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. దాడులకు పాల్పడుతున్నవారి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాధితులకు భరోసా కల్పిస్తోందని దళిత సంఘాలు అభినందిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు