సాగర్‌ ప్రాజెక్టును పరిశీలించిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు 

7 Oct, 2021 04:06 IST|Sakshi
సాగర్‌ ప్రాజెక్టు కుడికాలువను పరిశీలిస్తున్న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సీఈలు

టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు రోల్‌మోడల్‌గా ఉందని ప్రశంస 

విజయపురిసౌత్‌/రెంటచింతల (మాచర్ల): తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై గత నెలలో జారీ చేసిన గెజిట్‌ను అమలు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు చీఫ్‌ ఇంజినీర్లను నియమించింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సీఈలు టీకే శివరాజన్, అనుపమ్‌ ప్రసాద్‌ కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను పరిశీలించి అధ్యయనం చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం సాగర్‌ ప్రాజెక్టును,  టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టును సందర్శించారు. పరిశీలనలో భాగంగా సాగర్‌ ప్రధాన డ్యాం, కుడికాలువ, హెడ్‌ రెగ్యులేటర్, జలవిద్యుత్‌ కేంద్రం, ఎడమకాలువ హెడ్‌ రెగ్యులేటర్, క్రస్ట్‌గేట్లను, 220, 420 గ్యాలరీలను వాక్‌వే మీద నుంచి స్పిల్‌వేను పరిశీలించారు.

దెబ్బతిన్న స్పిల్‌వే ఫొటోలను సేకరించారు. సాగర్‌ ప్రధాన డ్యాం వద్ద కుడికాలువ, ఎడమకాలువల వద్ద ఏర్పాటు చేసిన టెలీమెట్రీలను కూడా పరిశీలించారు.  కాగా, పచ్చదనం, పరిశుభ్రత విషయంలో నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు ఇతర విద్యుత్‌ ప్రాజెక్టులకు రోల్‌మోడల్‌గా ఉందని వారు కితాబిచ్చారు. సాగర్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ ధర్మానాయక్, ఈఈ సత్యనారాయణ, డీఈ పరమేష్, టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు  డీఈలు దాసరి రామకృష్ణ, త్రినా«థ్, డ్యామ్‌ ఈఈలు కొడాలి శ్రీకాంత్, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు